ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ రాజధాని అంశాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీని వేసింది. ఇక ఇప్పటికే నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేదా వేరే చోటు ప్రపోజల్ లో ఉందా అనే  చర్చ జరుగుతుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలగపూడి కేంద్రంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టారు చంద్రబాబు.ప్రపంచం గుర్తించేలా సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుని భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుండగానే చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావటంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
           

 

              ఆ తర్వాత రాజధాని నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయని, రైతుల వద్ద నుండి భూములను లాక్కున్నారని, టీడీపీ నేతల బినామీలు రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములను కొన్నారని ఇక రాజధాని భూ కుంభకోణంపై విచారణ జరిపించిన తర్వాత రాజధాని నిర్మాణాలు చెయ్యాలని నిర్మాణాలను ఆపివేశారు. ముంపు ప్రాంతమని , ఇండియా మ్యాప్ లో లేదని రోజుకో చర్చ ఆ తర్వాత వరదల కారణంగా రాజధాని ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని, రాజధానిగా అమరావతి అనుకూలమైన ప్రాంతం కాదని వైసీపీ నీయకులు రాజధాని తరలింపు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిపై మరోమారు వివాదం నెలకొంది. 
       

 

            రాజధానిగా అమరావతి అనుకూలమైనది కాదని, రాజధాని తరలింపు త్వరలోనే జరుగుతుందని కొందరు వైసీపీ నేతలు ప్రస్తావించారు. అంతేకాక రీసెంట్‌గా కేంద్రం విడుదల చేసిన భారతదేశం పొలిటికల్ మ్యాప్‌లో కూడా అమరావతి పేరు లేకపోవడంతో పెద్ద చర్చే జరిగింది . సీఎం జగన్ ఏపీ రాజధాని అంశాన్ని తేల్చేందుకు జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసారు . ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాభిప్రాయాల్ని కూడా సేకరించింది. సుమారు ఆరు వారాలుగా రాష్ట్రమంతా పర్యటించిన నిపుణుల కమిటీ రాజధాని ప్రాంత అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించేందుకు సిద్దమైందని సమాచారం . 
         

 

          నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం రాజధానిలో కీలక మార్పులకు అవకాశం అని చర్చ ఒకపక్క రాజధాని రైతులు నిపుణుల కమిటీ నియామకానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. ఇక నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని, అసెంబ్లీ ప్రాంగణాన్ని మంగళగిరికి తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతుంది .ఇక అంతే కాకుండా ప్రస్తుతం కోర్ క్యాపిటల్ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు ఏ మాత్రం అనుకూలం కాదని కమిటీ తెల్చినట్టు తెలుస్తుంది. 
         

 

           రాజధానికి అవసరమైన కట్టడాలను గుంటూరు శివార్లలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్మించాలని రాజధాని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. కాజా సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక హైకోర్టును మాత్రం కర్నూలుకు తరలించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
       

 

           రాజధానిని పూర్తిగా తరలించడం వల్ల ఇప్పటి వరకు చేసిన ఖర్చు వృధా అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కావస్తున్న కట్టడాలను రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యాలయాలకు వినియోగిస్తూ, కొత్త సచివాలయం, అసెంబ్లీ వంటి భారీ నిర్మాణాలను నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో చెయ్యాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిసెంబర్‌లో ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: