ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్య కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో చదువుకోవటానికి ధరఖాస్తు చేసి ఎంపికైన వారికి ఈ ఆర్థిక సాయం అందనుంది. ఆర్థిక సాయం భారీగా పెంచటం పట్ల బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటానికి వీలుగా ప్రతి సంవత్సరం 1000 మందికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ధరఖాస్తు చేసిన అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షల రూపాయల లోపు ఉంటే మాత్రమే ఈ ఆర్థిక సాయానికి అర్హులవుతారు. ధరఖాస్తు చేసిన అభ్యర్థి వయస్సు జులై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. 
 
ఈ ఆర్థిక సాయం పొందాలంటే ఏపీ ఈపాస్ లో ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ధరఖాస్తు చేసుకొని ఉండాలి. బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపులకు నిబంధల ప్రకారం 
రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎంపిక విధానంలో 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. మహిళలు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. గతంలో ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుకోవటానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద 10 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం అందేది. 
 
వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం గుర్తించిన టాప్ 100 యూనివర్సిటీలో ఎక్కడైనా చదువుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ 15 లక్షల రూపాయలకు పెంచింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్స్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా దేశాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా చదువుకోవచ్చు. చైనా, కజికిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో మాత్రం మెడిసిన్ చదువుకునేందుకు అనుమతి ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: