ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకు ఎదురయ్యే ప్రధాన సమస్య అవినీతి. ఏ విభాగమైనా సరే చేతులు తడపందే పనులు కావు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే లంచాలు మెక్కే అవకాశంగా భావిస్తారు చాలామంది. ఈ లంచగొండి వ్యవస్థను ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి వల్లా కాలేదు. కానీ ఇప్పుడు జగన్ మరోసారి అవినీతి నిర్మూలనపై దృష్టి సారించారు. కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

 

 

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ఐఐఎం అహ్మదాబాద్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బృందం ముఖ్యమంత్రిగారి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.ఐఐఎం బృందం ఫిబ్రవరి వరకూ అధ్యయనం చేసి అవినీతి రహిత పాలనకు ఉపయోగపడే సిఫార్సులను, సూచనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

 

 

ప్రభుత్వ శాఖల్లో చేయాల్సిన మార్పులు, చేపట్టాల్సిన అవినీతి వ్యతిరేక చర్యలను తెలియజేస్తుంది. వనరుల్ని సమర్థంగా వాడుకునే విధివిధానలను సూచిస్తుంది. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడి మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన సలహాలను అందిస్తుంది. పారదర్శకమైన పాలన, అవినీతి నిర్మూలన అనే లక్ష్యాలతో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్. ఇందుకోసమే పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఎన్నో పౌరసేవలకు సచివాలయం కేంద్ర బిందువు.

 

 

ప్రతి చిన్న అవసరానికి మండల ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయం ద్వారా నేరుగా ప్రజలు తమ సమస్యలు తీర్చుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ సులువుగా ప్రజలకు చేరుతున్నాయి. మరి అవినీతిని నిర్మూంచాలన్న జగన్ ప్రయత్నం ఎంతవరకూ ఫలితాలు ఇస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: