రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోవచ్చు.. రాత్రికి రాత్రి ప్రభుత్వాలు మారిపోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిందిదే. తెల్లారితే సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం అని నిర్ణయమైపోయిన వేళ.. పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేసిన సందర్భాన..  యావద్భారతానికి షాక్ ఇచ్చింది బీజేపీ. ఏం జరిగిందో శివసేన తెలుసుకుని.. అర్ధం చేసుకుని.. తేరుకునేలోపు ముఖ్యమంత్రి పీఠం బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం జరిగిపోయింది.

 

 

నిజంగా ఇది రాజకీయాల్లో ఇది ఓ హఠాత్పరిణామం. శివసేన పలికిన బీరాలు, పట్టిన పంతం, కన్న కలలన్నీ అన్నీ తెల్లారేసరికి కల్లలైపోయాయి. సినిమాల్లో నాటకీయంగా చూపించే రాజకీయ సన్నివేశాల్ని తలపించింది మహారాష్ట్ర రాజకీయం. ‘రాజకీయాల్లో అపర చాణక్యుడు వచ్చే వరకూ ప్రతి ఒక్కరూ తాను చాణక్కుడినే అనుకుంటారు’ అన్న చందాన.. బీజేపీ తరపు ముక్క అమిత్ షా చేసిన మంతనాలు బీజేపీ నుంచి అధికారం కోల్పోకుండా చేశాయి. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు, ఎన్సీపీకి శరాఘాతంలా తగిలాయి. అజిత్ పవార్ దే తప్పు నాకూ ఏం తెలీదు.. అనే పరిస్థితికి శరద్ పవార్ వచ్చేశారు. అజిత్ పై ఉన్న కేసుల వల్ల బీజేపీకి భయపడి రాత్రికి రాత్రి బీజేపీకి లొంగిపోయారని శివసేన ఆరోపణలు చేస్తోంది. ఎన్సీపీ విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని కాంగ్రెస్ మండిపడుతోంది.

 

 

చతుర్ముఖ పోటీగా భావించిన మహా రాజకీయం త్రిముఖ పోటీగా జరుగుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. ముగ్గురునీ కొట్టుకోనిచ్చి మధ్యలో బీజేపీ వచ్చి అధికార పీఠాన్ని ఎత్తుకెళ్లిపోయింది. వ్యూహాత్మకంగా బీజేపీ పన్నిన వలలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన బలైపోయాయి. ‘మీరు అన్యాయం చేశారంటే.. కాదు వాళ్లు అన్యాయం చేశారు’ అని వాదనలు, దూషణలు చేసుకునే పరిస్థితులు కల్పించింది బీజేపీ. మధ్యలో అధికార పీఠం అధిష్టించి బీజేపీ మాత్రం చిద్విలాసంగా కూర్చుంది.. మహా పీఠాన్ని ఏలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: