ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక ‘స్పందన’ కార్యక్రమం ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. అర్జీలు తీసుకోవడం, అధికారులకు పంపడానికి పరిమితం కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో తిరుగు సమాధానం కూడా ఇస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై చర్చ నెలకొంది. దీంతో ప్రకాశం జిల్లా దీనిని మరింత విస్తృతపరిచేందుకు  ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ నిర్ణయించారు. సుదూర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు చెందిన వారికి సైతం ఈ సేవలు అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందన్న భావన వారిలో కల్పించాలని సంకల్పించారు.

 

జిల్లా ఎస్పీ ప్రతి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు  తన వద్దకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడతారు. మ.2.30–4.00 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ పోలీసుస్టేషన్లకు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఆన్‌లైన్‌ స్పందన కార్యక్రమానికి సంబంధించి టైమ్‌స్లాట్‌ను నిర్ణయించనున్నారు. విదేశాలలో ఉండేవారు ముందుగా ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ప్రకాశం జిల్లా వాట్సప్‌ నంబర్‌ 9121102266కు లేదా ‘ప్రకాశం పోలీస్‌’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు ఒక రిక్వెస్ట్‌ పంపుకోవాలి. దీంతో తమకు ఫలానా సమయంలో కుదురుతుందని పేర్కొంటూ ఆ సమయాన్ని వాట్సప్‌ ద్వారా ఒక లింక్‌ ఇస్తారు. దాని ద్వారా నేరుగా ఎస్పీతో మాట్లాడేందుకు అవకాశం కలుగుతుంది.స్పందన రశీదును ఇలా మాట్లాడిన వారికి కూడా ఆన్‌లైన్‌ లేదా వారి బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్తే  కూడా అందజేస్తారు.  సీఎం ఆదేశాలను జిల్లా ఎస్పీ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఫిర్యాది, విచారణాధికారి, తాను ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి ఈనెల 25 నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందనను నిర్వహించాలని నిర్ణయించారు.

 

ఎస్పీకి తామూ జిల్లాకు చెందిన వారమేనని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఓ ప్లాట్‌ఫాం అవసరమంటూ తమ ఆవేదనలను ఇప్పటికే  ఫేస్‌బుక్‌ ద్వారా పలువురు తెలియజేశారు. భూ సమస్యలను సైతం రెవెన్యూ, భూసర్వే విభాగం తదితర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా పరిష్కరిస్తుండడంతో జర్మనీ, హైదరాబాదు నుంచి ఎస్పీకి వినతులు అందాయి. దీంతో స్పందనను విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించారు.  


 ‘స్పందన’  పోలీసు శాఖపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు మంచి అవకాశంగా నాకు అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి సెలవులు లభించక ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించా. ఇక విదేశాల్లో ఉండేవారి వెతలు చెప్పక్కర్లేదు. వారి సమస్య ప్రకాశం జిల్లా పరిధిలోనిది అయినపుడు వారికి కూడా న్యాయం జరగాలి కదా అన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌ స్పందనను ప్రారంభిస్తున్నాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: