ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో, బస్టాండులలో, అన్ని డిపోలలో నిరసనలు చేపడుతున్నారు. కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ ల ఎదుట ఆర్టీసీని కాపాడుకుందామంటూ మానవహారం నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డిపో దగ్గర కార్మికులు విధుల్లోకి తీసుకోవాలంటూ డిపో ముందు బైఠాయించటంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ లో అద్దె బస్సులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. అరకొరగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు మార్గమధ్యంలోనే మొరాయిస్తున్నాయి. సమ్మె విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం వైపు నుండి స్పందన లేకపోవటంతో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 
 
సీఎం కేసీఆర్ స్పందించి తగిన న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. ఈరోజు సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష చేసి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 
 
కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశం తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా...? లేదా...? చూడాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. 50 సంవత్సరాల పై బడిన ఆర్టీసీ కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటించి మిగతా కార్మికులను కొన్ని షరతులు పెట్టి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: