మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై సోమ‌వారం సుప్రీంలో వాదోప‌వాదన‌లు మొద‌ల‌య్యాయి.  కోర్టు స్పంద‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. మరోవైపు ఇప్పటికే గవర్నర్ ఆహ్వాన పత్రికతో పాటు, ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను ఫడ్నవిస్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం ధర్మాసనానికి నివేదించ‌డం గ‌మ‌నార్హం. ఫ‌డ్న‌వీస్ లేఖ‌లో పేర్కొన్న అంశాల‌ను బ‌ట్టి బీజేపీకి స్వ‌తంత్రులు, ఎన్సీపీ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు తెలుపుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు 170మంది స‌భ్యులు ఆమోదం తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు.

 

బీజేపీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఉంద‌ని దేవేంద్ర‌ఫ‌డ్న‌వీస్‌, బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లు ఎన్సీపీ నేత 50 మంది ఎమ్మెల్యేల సంత‌కాల‌తో ఉన్న లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అందించ‌డంతోనే ఆయ‌న వారిపై విశ్వాసం ఉంచి ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించిన‌ట్లు  మోహ‌తా కోర్టుకు విన్న‌వించారు. గవ‌ర్న‌ర్‌కు ఆ విచ‌క్ష‌ణాధికారం రాజ్యాంగం క‌ల్పించింద‌ని పేర్కొన్నారు.  

 

గవర్నర్ నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టలేదనీ.. బలపరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా కోర్టు చేతిలో ఉండ‌ద‌ని ఆయ‌న కోర్టుకు విన్న‌వించారు. బలపరీక్షకు బీజేపీ సిద్ధమేననీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని కోర్టుకు తెలిపారు. అయితే  మ‌హారాష్ట్ర‌లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయ ప్ర‌తిష్ఠంభ‌న రీత్యా గ‌వ‌ర్న‌ర్ ఎప్పుడు బ‌ల‌నిరూప‌ణ‌కు ఆదేశిస్తే అప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని వివ‌రించారు.మోహ‌తా వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు  సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మెజారిటీ మద్దతు ఉందా లేదా అన్నదే ముఖ్యమనమైన అంశ‌మ‌ని పేర్కొంది. 

 

అది బ‌ల‌నిరూణద్వారా మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై  మెహాతా మ‌ళ్లీ త‌న వాద‌న‌ను వినిపించారు. అసెంబ్లీలో బీజేపీ అతి పెద్ద పార్టీ అయినందున ఆ పార్టీకే గవర్నర్ ఆహ్వానం పంపారని తెలిపారు. బీజేపీకి తన ఎమ్మెల్యేలతో పాటు దానికి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియ‌జేశారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎలాంటి ఇబ్బందీ లేనందున మధ్యంతర ఉత్తర్వులేవీ ఇవ్వొద్దంటూ ధర్మాసనాన్ని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: