గత కొన్ని రోజులుగా ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

 

ఈ నిర్ణయం వల్ల మాతృ బాష తెలుగు ఇబ్బందుల్లో పడిపోతుందని మొదట్లో కామెంట్లు చేసిన ప్రతిపక్ష నాయకులు...తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకిత రావడంతో, ఇంగ్లీష్ మీడియం తాము వద్దు అనడం లేదని, కానీ తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుతున్నారు.

 

ఇక దీనిపై నేడు మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ...ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పారు. సామాన్య ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? అని ఆయన ప్రతిపక్షాలని ప్రశ్నించారు. అలాగే తాము మాతృబాషకు వ్యతిరేకం కాదని, అందుకనే ప్రతి తరగతికి తెలుగు సబ్జెక్ట్ ని తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక ఇంగ్లీష్ మీడియం ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు.

 

ఇంగ్లీష్ మీడియం విద్యపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అలాగే ప్రజల నుంచి తిరస్కరణ రావడంతో, ప్రతిపక్షాలు యూటర్న్ తీసుకున్నాయని, అందుకే ఇంగ్లీష్ కు తాము వ్యతిరేకం కాదని చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇక ఈ నెల 28న చంద్రబాబు రాజధాని పర్యటనపై కూడా బొత్స కామెంట్లు చేశారు.

 

చంద్రబాబు ముందుగా తాను ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారో రైతులకు చెప్పాలని ఆయన అన్నారు. 9వేల కోట్ల బడ్జెట్ కు 4900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన అన్నారు. నాలుగు బిల్డింగ్ లలో ఒకటే 90 శాతం అయిందని, మిగిలినవి 50 నుంచి 70 శాతం అయ్యాయని, మరి ఈ ఐదేళ్లు చంద్రబాబు ఏమైనా గొర్రెలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: