స‌మ్మె విర‌మించిన‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్టీసీ కార్మికుల జేఏసీ కార్మికులు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే డిపోల వద్దకు విధుల్లో చేరేందుకు రావాల‌ని ఇచ్చిన‌ పిలుపు ఉద్రిక్త‌త‌కు దారితీసింది. కార్మికుల జేఏసీ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే.. లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆర్టీసీ కార్మికలను విధుల్లో చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. అయినప్పటికీ కార్మికులు విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో...తెలంగాణ‌  రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిపోలకు వచ్చి పోయే రోడ్డులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని.. కార్మికులు ఎవరు కూడా డిపోల దగ్గరకు రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్‌ రాణిగంజ్ డిపో వద్దకు వచ్చిన రెగ్యులర్ కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. డిపోలోకి తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లను మాత్రమే అనుమతించారు. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమ, ఫారూఖ్ నగర్ ఆర్టీసీ డిపోలలో విధులకు హాజరు కావడానికి వస్తున్న కార్మికులను అరెస్ట్ చేశారు.

 

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విధుల్లోకి చేరడానికి వస్తున్న కార్మికులను వివిధ డిపోల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఫలక్‌నుమ డిపో దగ్గర భాష్ప వాయువు ప్రయోగించే వాహనాన్ని కూడా ఉంచారు ఫలక్‌నుమ పోలీసులు. ప‌లు చోట్ల  వాళ్లను కూడా చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లు మాత్రమే బస్సులను డిపో నుంచి బయటకు తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల దగ్గర భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్సులు రోడ్డెక్కాయి.

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో పనిచేసే మంగల్‌పాడ్‌ అనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తమని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నడిపోల ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో మంగల్‌పాడ్‌ మృతి చెందడం కార్మికుల్లో తీవ్ర ఆందోళన రెకెత్తిస్తోంది. కాగా, గురువారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీలో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉందంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: