దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైని క‌లిగి ఉన్న మ‌హారాష్ట్రలో ట్విస్టుల ప‌రంప‌ర‌కు చెక్ ప‌డింది. మహారాష్ట్ర రాజకీయాల్లో గ‌త కొద్దికాలంగా కొన‌సాగుతున్న షాకుల ప‌రంప‌ర‌కు బ్రేక్ ప‌డేలా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. అనంత‌రం కొద్దిసేప‌టికే... మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ఫడణవీస్.. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, ఫ‌డ‌ణ‌వీస్ రాజీనామాకు కార‌ణ‌మైన అజిత్ విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

 

బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ ప‌వార్‌కు వ్య‌తిరేకంగా శివ‌సేన‌-ఎన్‌సీపీ-కాంగ్రెస్ త‌మ ప్ర‌య‌త్నాలు తీవ్రం చేశాయి. సోమ‌వారం సంకీర్ణ కూటమి బల ప్రదర్శన చేశాయి. మ‌రోవైపు సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. బుధ‌వారం సాయంత్రం లోపు సభలో బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇటు బీజేపీ, అటు అజిత్ వర్గం ఇరకాటంలో పడింది. అప్ప‌టికే త‌న‌ను ఎన్‌సీపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌గా తొల‌గించ‌డం, ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో అజిత్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అనంత‌రం కొద్దిసేప‌టికే...సీఎం ఫడ్నవీస్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేసేశారు.

 


అయితే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంలో ఓ మ‌హిళ‌ కీల‌క పాత్ర పోషించార‌ని తెలుస్తోంది. 
ఆమె శరద్‌ పవార్‌ భార్య ప్ర‌తిభ‌. అజిత్‌ పవార్‌తో శ‌ర‌ద్ స‌తీమ‌ణి ప్ర‌తిభ‌ మంతనాలు జరిపారు. పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి అజిత్‌ను సస్పెండ్ చేయలేద‌ని శరద్‌ పవార్ స‌తీమ‌ణి వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికైనా మ‌న‌సు మార్చుకుంటే క‌లిసి పనిచేసుకోవ‌చ్చు ఆమె చెప్ప‌డంతో..అజిత్‌ పవార్‌ మనసు మార్చుకున్నట్టుగా చెబుతున్నారు. 
డిప్యూటీ సీఎం పదవి విష‌యంలో ఎన్సీపీ నేతలు విమ‌ర్శ‌లు చేయ‌డం, ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత గూటికి మ‌ద్ద‌తివ్వాల‌ని కుటుంబ స‌భ్యులు తీవ్రంగా ఒత్తిడి చేయ‌డంతో...అజిత్‌ పవార్ త‌న ప‌ద‌వికి బైబై చెప్పిన‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: