పార్టీ ఓట‌మికి కార‌ణాలు తెలుసుకోవ‌డం, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్తల్లో భ‌రోసా నింపడం, ఓట‌మి అంచులో నిల‌బ‌డి ఇబ్బంది ప‌డుతున్న పార్టీని బ‌లోపేతం చేయ‌డమే ల‌క్ష్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు, పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష‌లు పుంజుకున్నాయి. ఇప్ప‌టికే విశాఖ‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, కృష్ణా వంటి కీల‌క జిల్లాల్లో ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపిన చంద్ర‌బాబు.. ఇప్పుడు తాజాగా అత్యంత కీల‌క‌మైన క‌డ‌ప జిల్లాలో స‌మీక్ష చేస్తున్నారు. మొత్తం మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చారు. ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి క‌డ‌ప అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా. ఓట‌మి ఎరుగ‌ని కుటుంబంగా ఇక్క‌డ వైఎస్ ఫ్యామిలీ గుర్తింపు పొందింది.

 

అలాంటి జిల్లాలో చంద్ర‌బాబు స‌మీక్ష చేప‌ట్ట‌డం రాజ‌కీయంగా ఆ పార్టీలో అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, సాధార‌ణంగా బాబు త‌న‌దైన శైలిలో ప్ర‌సంగాలు కుమ్మ‌రించారు. అదేక్ర‌మంలో స్థానిక నాయ‌కులు త‌మకు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు చెప్పు కొన్నారు. క‌డ‌ప‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌ధానంగా ఉన్న అడ్డంకులను ఇక్క‌డి నాయ‌కులు ఏక‌రువు పెట్టారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో  వైసీపీ బ‌లంగా పోటీ చేసినా.. మ‌న పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల కార‌ణంగా ఆశించిన మేర‌కు ఫ‌లితం ద‌క్కించుకోలేక పోయామ‌ని వాపోయారు. దీనికి కీల‌క నేత‌లు చేస్తున్న రాజ‌కీయ వ‌ర్గ పోరే కార‌ణ‌మ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి వేధింపులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, పార్టీ మారిపోవాల‌నే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు పూర్తిగా కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను తెలుసుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ నేత సూర్యనారాయణరెడ్డిని పార్టీ మారాలంటూ.. వైసీపీ నుంచి ఒత్తిడులు రావ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై విమ ర్శ‌లు గుప్పించారు. ఇదిలావుంటే, క‌డ‌ప‌లో కీల‌క నేత‌లు ఒక‌రిద్ద‌రు ఈ స‌మీక్ష‌కు హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సీఎం ర‌మేష్ వ‌ర్గంగా పేరున్న నాయకులు చాలా మంది ఈ స‌మీక్ష‌కు హాజ‌రుకాలేదు. ఇక‌, స‌మీక్ష‌కు వ‌చ్చిన వారిలోనూ ఎక్కువ మంది త‌మ‌కు వైసీపీ ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌వుతున్న వేధింపుల‌నే ఏక‌రువు పెట్టారు త‌ప్ప‌.. పార్టీ ప‌రంగా ముందుకు ఎలా వెళ్లాలి? ఏ విధంగా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌నే విష‌యంపై దృష్టి పెట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

 

క‌డ‌ప న‌గ‌ర శివారులోని ఓ కళ్యాణ మండ‌పంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి స‌మావేశానికి నేత‌ల నుంచి స్పంద‌న ఎలా ఉ న్నా.. కార్య‌క‌ర్త‌ల నుంచి ఆశించిన మేర‌కు స్పంద‌న బాగానే రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పార్టీలో ఉంటూ.. గోతులు తీసేవారికి, ఎక్క‌డిక‌క్క‌డ అవ‌స‌రార్థం పార్టీ మారేవారికి తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌కాశం ఇవ్వ‌బోన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో పార్టీని సంస్థా గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించే బాద్య‌తను కార్య‌క‌ర్త‌లే తీసుకోవాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి చెంగ‌ల్రాయుడు, పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, న‌ర‌సింహ‌ప్ర‌సాద్ వంటివారు హాజ‌రైనా.. ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం, క‌లివిడి లేక పోవ‌డం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింద‌ని ప‌రీశీల‌కులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: