వాటర్ బెల్.. ఇప్పుడు తెలంగాణలోని పలు స్కూళ్లలో ఈ కొత్త బెల్లు సంచలనం సృష్టిస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం అనుసరిస్తున్న ఈ కొత్త విధానం పిల్లల్లోనూ ఆసక్తి రేపుతోంది.కేరళ, కర్ణాటక, తమిళనాడు బడుల్లో అమలుచేస్తున్న ఈ సరికొత్త పద్ధతిని తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు. స్కూలు ప్రారంభమయ్యాక రెండో పీరియడ్ ముగియగానే వాటర్ బెల్ మోగుతుంది. అన్ని తరగతుల్లోని విద్యార్థులంతా వాటర్ బాటిల్ పైకెత్తి.. గటగటా నీళ్లు తాగేసి.. పాఠం వినేందుకు సిద్ధమవుతున్నారు.

 

మళ్లీ ఇంటర్వెల్ బెల్ తర్వాత మొదటి పిరియడ్ ముగియగానే మళ్లీ బెల్ మోగుతోంది. మరలా నీళ్లు తాగి.. చదువుల్లో మునిగిపోతున్నారు. మళ్లీ ఇంటికి వెళ్లే ముందు మరోసారి వాటర్ బెల్ మోగుతోంది. ఇక బాటిల్‌లో ఉన్న నీళ్లన్నీ ఖతం చేసి.. తాపీగా ఇంటికి పయనమవుతున్నారు బడిపిల్లలు. ఇలా పాఠశాలల పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు ఉపాధ్యాయులు. ఇళ్లలో తల్లిదండ్రులు ఎంత మొత్తుకుంటున్నా సరిగ్గా నీరు తీసుకోని పిల్లలు స్కూళ్లలో మాత్రం చకచకా నీరు తాగేస్తున్నారు.

 

ఈ వాటర్‌బెల్ విధానం ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అమలవుతోంది. నేటి నుంచి మరి కొన్ని బడులల్లో అమలు కానుంది. ఈ బెల్ మోగినప్పుడల్లా.. విద్యార్థులు కచ్చితంగా నీరు తాగాల్సిందే. విద్యార్థులు క్రమం తప్పకుండా మంచినీళ్లు తాగేలా చేసి, వారి ఆరోగ్యాన్ని కాపాడడం ఈ వాటర్ బెల్ ప్రధాన లక్ష్యం. రోజులో మూడు, నాలుగు సార్లు ఈ గంట మోగుతుంది.

 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు.. వెసులుబాటును బట్టి వాటర్ బెల్ నిర్వహించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే సూచించారు. ఆమె సూచన మేరకు యాదాద్రి భువనగిరి, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్ వంటి జిల్లాల్లోని డీఈఓలు ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26,050 ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా ఈ వాటర్‌బెల్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: