2019 ఎన్నికల్లో అదృష్టం కాలదన్నుకుని దురదృష్టం వైపు పయనించిన వారిలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కూడా ఒకరు. కలిసొచ్చే వైసీపీని కాదనుకుని టీడీపీలో చేరి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇక బొక్కబోర్లా పడ్డాక తప్పు తెలుసుకుని మళ్ళీ సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పార్టీ మారి తప్పు చేసిన గౌరు చరితా రెడ్డి వైఎస్ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వైఎస్ ఆమెకు 2004లో నందికొట్కూరు సీటు ఇచ్చారు.



ఆ ఎన్నికల్లో ఆమె మంచి విజయమే నమోదు చేశారు. టీడీపీ అభ్యర్ధి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై దాదాపు 13 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇక వైఎస్ మరణాంతరం ఆమె జగన్ వెంట నడిచారు. దీంతో ఆమె మీద నమ్మకంతో జగన్  2014 ఎన్నికల్లో పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఆమె విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల దగ్గరకొచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి.



నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా పాణ్యం టికెట్ ని కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారు. అలాగే గౌరు చరితాకు అధికారంలోకి వస్తే కీలక పదవి ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఈలోపే గౌరు ఆవేశపడ్డారు. సీటు కోసమని చెప్పి భర్త వెంకటరెడ్డితో కలిసి, టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక టీడీపీ తరుపున 2019లో పాణ్యంలో పోటీ చేశారు.  కానీ జగన్ గాలిలో ఆమె 43 వేల మెజారిటీతో కాటసానిపై ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి ఆమె సైలెంట్ అయిపోయారు.


ఎలాగోలా వైసీపీలో ఉన్న భవిష్యత్తు బాగుండేదని బాధపడుతూ...జగన్ చెంతకు చేరాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలతో వైసీపీలోకి వెళ్ళేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈమె చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే వైసీపీలోకి వెళ్ళే అవకాశముంది. మరి చూడాలి గౌరు చరితా చేరికకు జగన్ సిగ్నల్ ఇస్తారో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: