రాజ‌కీయాల్లో పైచేయి సాధించేందుకు అన్ని కోణాల్లోనూ దృష్టి పెట్ట‌డం రాజ‌కీయాల్లో ఉన్న‌వారు సాధార‌ణంగా చేసే ప‌నే. ఈ క్ర‌మంలోనే ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ కూడా త‌న‌దైన శైలిలో రాజ‌కీయ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీకి ఏపీలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఒక‌ప‌క్క ఓట‌మి పార్టీని తీవ్రంగా కుంగ‌దీస్తుండ‌గా, మ‌రోప‌క్క‌, పార్టీలోని సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా బాబుకు దూర‌మ‌వుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ ఇరుకున ప‌డుతోంది. ఇంత‌లోనే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి. బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి కూడా ఇటీవ‌ల కాలంలో టీడీపీ కేంద్రంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది త‌మ పార్టీలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నార‌ని అన్నారు.



ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించాయి. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి వారు పార్టీకి దూర‌మైన‌నేప‌థ్యంలో సుజ‌నా వ్యాఖ్య‌లు మ‌రింత‌గా పార్టీలో మంట‌పుట్టించాయి.అయితే, వీటిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా చంద్ర‌బాబు అండ్ కోలు వ్యూహాత్మ‌క మౌనం పాటించారు. అస‌లు కేంద్రంలోని బీజేపీ ఏపీపై ఎలాంటి ఆప‌రేష‌న్ చేయాల‌ని భావిస్తోంది. ఇక్క‌డ ఏం జ‌రుగుతుంది?  ప‌రిణామాలు ఎలా మార‌తాయి?  వంటి కీల‌క విష‌యాల‌పై అంత‌ర్గ‌తంగా చ‌ర్చ చేస్తోంది.



ఇదే స‌మ‌యంలో బీజేపీ అధికార వైసీపీ నేత‌ల‌పైనా క‌న్నేసింద‌నే వార్త‌లు టీడీపీలో సంతోషాన్ని పెంచుతున్నాయి. వైసీపీ బ‌ల‌హీన‌ప‌డ‌డం అనేది ఇప్పుడు బీజేపీ వేసే అడుగుల‌ను బ‌ట్టే ఉంటుంద‌ని భావిస్తోంది. వైసీపీలో ఒక్క వికెట్ ప‌డినా.. కూడా అంటే ఏ ఒక్క ఎంపీ అయినా పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే.. వైసీపీపై మాన‌సికంగా పోరు పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. పైగా ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ వేస్తున్న అడుగులు కూడా ఆ పార్టీకి అంతుబ‌ట్ట‌డం లేదు.



అటు అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తుంద‌ని అనుకున్నా.. ఇప్పుడు త‌మ‌పైకి గాలి మ‌ళ్లించ‌డంపై కేంద్రంలో జ‌రుగు తున్న ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. కేంద్రం ఎటు నుంచి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం లేదా ఎదురుదాడికి దిగ‌కుండా.. మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రించ‌డంపైనే టీడీపీ దృష్టి పెట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: