ఠాక్రే సోదరుల మధ్య మళ్ళీ సంబంధాలు చిగురిస్తున్నాయా? అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే అవుననే సమాధానమే విన్పిస్తోంది . ఇటీవల రాజ్ ఠాక్రే కుమారుడి పెళ్ళికి కుటుంబ సమేతంగా హాజరయిన ఉద్దవ్ ఠాక్రే , ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి కూడా సోదరుణ్ణి ప్రత్యేకంగా ఆహ్వానించడం పరిశీలిస్తే ... సోదరులిద్దరి మధ్య మళ్ళీ సత్ సంబంధాలు నెలకొంటున్నట్లు స్పష్టం అవుతోంది .  గురువారం దాదర్ లోని శివాజీ పార్క్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెల్సిందే .

 

తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఫోన్ చేసి రాజ్ ఠాక్రే ను ఉద్దవ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది . రాజ్ ఠాక్రే కూడా 2004 వరకు శివసేన లోనే కొనసాగారు . బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు రాజ్ ఠాక్రే నేనని అందరూ భావించారు .  అయితే శివసేన అధినేత బాల్ ఠాక్రే మాత్రం తన తరువాత పార్టీ బాధత్యలను  రాజ్ ఠాక్రే కు కాకుండా,  రాజకీయాలకు దూరంగా ఉన్న ఉద్దవ్ కు అప్పగించారు . ఇక తన మద్దతుదారుడిగా ఉన్న నారాయణ రాణే ను పార్టీ నుంచి బహిష్కరించడం తో  చిన్నాన్న బాల్ ఠాక్రే  వైఖరితో విసిగిపోయిన రాజ్ ఠాక్రే, శివసేన కు గుడ్ బై చెప్పారు . అంతటి తో ఆగకుండా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పేరిట సొంత పార్టీ స్థాపించారు .

 

శివసేన లో ఒక వెలుగు వెలిగిన రాజ్ ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్న తరువాత క్రమేపి తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు . అదే సమయం లో ఉద్దవ్ ఠాక్రే తన ఇమేజ్ ను పెంచుకుంటూ , బాల్ ఠాక్రే వారసుడిగా రాజకీయంగా నిలదొక్కుకున్నారు  . గతం లోని విబేధాలను మర్చిపోయి ఉద్దవ్ ఠాక్రే , రాజ్ ను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం పట్ల శివ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: