జగన్ సొంత జిల్లా కడప అన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లా దిశ దశ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే జగన్ కడప, పులివెందుల పట్టణాల అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. ఈ రెండు పట్టాణాలను తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇప్పుడు సొంత జిల్లాకు సంబంధించి మరో గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్.

 

అదేంటంటే..కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2019 డిసెంబర్‌ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లి, నందలూరు గ్రామాల మధ్య స్థలాన్ని గుర్తించి ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయాలని, దీని కోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

 

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 3295 ఎకరాల భూమిని సేకరించాలని, అదే కాకుండా కడప స్టీల్‌ ప్లాంట్‌కు కావాల్సిన ఇసుక ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేయడం జరిగింది. జగన్ నిర్ణయంతో కడప జిల్లావాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే కడప ఉక్కుకర్మాగారం ఏర్పాటు అనేది ఆ జిల్లావాసుల కల.

 

గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరిగినా అవి పెద్దగా ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఆ కంపెనీ పూర్తిగా మూతబడింది. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూడా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ అధికారం దిగి పోయే ముందు మాత్రమే కాస్త హడావిడి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కడప స్టీల్ ప్లాంటుపై ప్రజల్లో ఆశలు కలుగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: