సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చదువులో వెనుకబడిన విద్యార్థులకు త్వరలో ఫోన్ ద్వారా ప్రత్యేక బోధన అందించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టెలీ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బోధన అందేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. 
 
సాధారణంగా విద్యార్థులు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ట్యూటర్ సహాయంలో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది విద్యార్థులు మొహమాటం, బిడియం మొదలైన కారణాల వలన సందేహాలను టీచర్లను, ట్యూటర్లను అడగలేక చదువులో వెనుకబడిపోతున్నారు. విద్యాశాఖ ప్రవేశపెడుతున్న టెలీ టీచర్స్ సహాయంతో ఫోన్ ద్వారా సందేహాలను అడగొచ్చు. 
 
రాష్ట్ర విద్యాశాఖ ఈ విధానం ద్వారా విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో ఈ విధానంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, అధ్యాపకులు, రిటైర్డ్ ఉపాధ్యాయుల ద్వారా టెలీ ట్యూషన్లను నిర్వహించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ విధానం మహారాష్ట్ర రాష్ట్రంలో అమల్లో ఉంది. వెనుకబడిన విద్యార్థులు ఈ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. 
 
విద్యాశాఖ అధికారులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు విద్యార్థుల సబ్జెక్ట్ లకు సంబంధించిన టెలీ ట్యూటర్ నంబర్ ను ఇవ్వడం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ విధానం ద్వారా 8,9,10వ తరగతుల విద్యార్థులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. భయపడే, మొహమాటపడే విద్యార్థులు ఈ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: