అమరావతి ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తారా.. లేదా అన్న సస్పెన్స్ ఇంకా వీడనే లేదు. మరోవైపు సింగపూర్ కంపెనీలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయాయి. ఏపీ సర్కారే మీకూ మాకు కుదరదని చెప్పేసింది. ఇప్పుడు దీనిపై టీడీపీ, వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి.

 

అయితే ఇదే అమరావతి అంశం సింగపూర్ లోనూ హాట్ టాపిక్ అవుతోందట. ఎందుకంటే..అమరావతి సహా విదేశాల్లో సింగపూర్‌ సంస్థల పెట్టుబడులకు సంబంధించి బ్రాడ్‌ బోయర్‌ అనే విపక్ష నేత తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. దాని ప్రకారం.. సింగపూర్ ప్రభుత్వం.. అమరావతిలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని..ఇప్పుడు అవన్నీ వృథా అయ్యాయని ఆ పోస్ట్ లో ఆరోపించారట.

 

అంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ కన్సార్షియం వైదొలగినా.. ఈ ప్రకంపనలు తగ్గలేదన్నమాట. అది కూడా ఏపీతో పాటు సింగపూర్ దేశంలో కూడా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయట. అయితే ఈ ఆరోపణలను సింగపూర్‌ ప్రభుత్వం మాత్రం ఖండిస్తోంది.

 

అంతే కాదు.. ఇలాంటి బాధ్యతారహితమైన పోస్టు పెట్టినందుకు సదరు ప్రతిపక్షంపై కేసు పెడుతోందట. తొలిసారిగా తప్పుడు వార్తల నిరోధ చట్టాన్ని ప్రయోగించిందట. అమరావతిలో సింగపూర్‌ సంస్థలు భారీ ఖర్చేమీ పెట్టలేదని సింగపూర్ చెబుతోందట. సామాజిక మాధ్యమాల్లో అసత్య, తప్పుడు వార్తల ప్రచారాన్ని నిరోధించేందుకు సింగపూర్‌ ప్రభుత్వం ఇటీవలే ‘ప్రొటెక్షన్‌ ఫ్రం ఆన్‌లైన్‌ ఫాల్స్‌హుడ్స్‌ అండ్‌ మానిప్యులేషన్‌ చట్టం తీసుకొచ్చింది. విదేశాల్లో సింగపూర్‌ సంస్థల పెట్టుబడులకు సంబంధించి బోయర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయని, ఆ పోస్ట్‌ను తొలగించాలని బోయర్‌కి సూచించింది. మరి ఆ ప్రతిపక్ష నేత ఏం చేస్తారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: