ఏపీలోని ఆర్ధిక పరిస్తితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ...మొదట జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడిన ఆయన..తర్వాత రాష్ట్ర పరిస్థితులు గురించి వివరించారు. బీసీ అభివృద్ధికి 15 వేల కోట్ల వరకు బడ్జెట్ లో కేటాయింపులు చేశామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు.

 

ఒకవైపు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్న కూడా, చంద్రబాబు పోతూ పోతూ ఒక మంచి వనరులు ఉన్న రాష్ట్రం తనకు ఇచ్చిపోలేదని, ప్రతి అడుగులోనూ అప్పు పెట్టేసి వెళ్లారని, అయిన కూడా బాధపడకుండా, రాష్ట్ర పరిస్తితి ఇంత దారుణంగా ఉందని చెప్పి సంక్షేమ పథకాలు ఎగరగొట్టకుండా ప్రతిదీ అమలు చేశామని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్న, దేవుడు ఆశీస్సులతో, మంచి మనసుతో ముందడుగు వేస్తున్నామని చెప్పారు.

 

దేశంలో ఉద్యోగాలు పోయే పరిస్తితి ఉన్నా, రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అలాగే దాదాపు 46 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇవ్వడం జరిగిందని, ఇందులో కౌలు రైతులకు కూడా సాయం చేశానని చెప్పారు. ఇక ఆటొ, క్యాబ్ డ్రైవర్లకు దాదాపు 2.36 లక్షల మందికి వాహనమిత్రా ద్వారా సాయం చేశామని, ఇక మత్యకార సోదరులకు 10 వేలు సాయం చేశామని అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే హామీ ఇచ్చిన వాటితో పాటు ఎన్నో ప‌థ‌కాలు అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చామ‌ని కూడా చెప్పారు.

 

పెన్షన్ల విషయానికొస్తే చంద్రబాబు హయాంలో నెలకు సగటున 500 కోట్లు ఇస్తే, తాము 1400 కోట్ల వరకు ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా నాడు-నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలలని అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టామని, త్వరలోనే అద్భుతమైన పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: