ఆరునెల‌లు పోతే... వాళ్లు వీళ్ల‌వుతారు... అన్న సామెత రాజ‌కీయాల‌కు బాగా అక్క‌ర‌కు వ‌స్తుంది. ముఖ్యంగా బీజేపీకి చాలా బాగా వ‌ర్తిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్ర జ‌వ‌స‌త్వం లేకున్నా..స్లోగా నైనా పార్టీకి పునాదులు వేసిన నాయ‌కులకు ఏమాత్రం న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని కొంత‌మంది సీనియ‌ర్లు అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నార‌ట‌. అందులో ఒక‌ప్పుడు బీజేపీ జాతీయ రాజీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఇంద్ర‌సేనారెడ్డిని ప్ర‌స్తుతం పార్టీ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆయ‌న వ‌ర్గీయులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని స‌మాచారం.

 

స్వ‌త‌హాగా ఆయ‌న ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా మాట్లాడ‌ట‌మే ఆయ‌న‌కిప్పుడు చేటు చేసింద‌నేది ఆయ‌న వ‌ర్గీయుల మాట‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఇంద్ర‌సేనారెడ్డి ఇటు తెలంగాణ ప్రాంతంలో.. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీకి పునాదులు వేశార‌న్న‌ది ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్న మాట‌. హైద‌రాబాద్‌లో నిర్మించిన పార్టీ కార్యాల‌యం కూడా ఆయ‌న హ‌యాంలో జ‌ర‌గ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఈ స్థాయిలోకి గుర్తింపు రావ‌డంలోనూ ఆయ‌న ప్రాతినిధ్యం మ‌రువ‌లేనిద‌ని చెప్పుకొస్తున్నారు.

 

ఇలా పార్టీకి అనేక విధాలుగా సేవ చేసిన ఇంద్ర‌సేనుడికి పార్టీ మాత్రం స‌ముచిత గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్ల‌ను అంద‌లం ఎక్కిస్తుంటే ఒక్కింత బాధ‌గా ఉంద‌ని ఆయ‌న స‌న్నిహితులు వాపోతుండ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌న స‌హ‌చ‌ర నాయ‌కులుగా ప‌నిచేసిన బండారు దత్తాత్రేయ‌, విద్యాసాగ‌ర్‌రావు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల‌తో గౌర‌వం పొందారు. ఇక కిష‌న్‌రెడ్డికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో ఆయ‌న ఇమేజ్ పార్టీలో అమాంతం పెరిగింది.

 

అయితే సీనియ‌ర్‌గా ఇంద్ర‌సేనారెడ్డి కూడా త‌న‌కూ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కావాల‌ని కోరుకుంటున్నార‌ని ఆయ‌న మ‌న‌స్సులోని మాట‌ను స‌న్నిహితులు బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ విష‌యమై అధిష్ఠానం ఆలోచిస్తే బాగుటుంద‌ని చెబుతున్నారు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఓ సీనియ‌ర్ నాయ‌కుడి కోరిక తీర్చ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని, ఈ విష‌య‌మై త్వ‌ర‌లోనే అమిత్‌షా, మోదీల‌ను క‌లిసేందుకు ఇంద్ర‌సేనా రెడ్డి వ‌ర్గం నేత‌లు రెడీ అవుతున్నారు. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వీరి కోరిక నెర‌వేరుతుందో ?  లేదో ?  చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: