ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో వైసీపీది గెలుపు కాదు.. భారీ గెలుపు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 కైవ‌సం చేసుకోవ‌డం, 25 పార్ల‌మెంటు స్తానాల్లో 22 సొంతం చేసుకోవ‌డం అంటే మామూలు విజ‌యంగా చూడ‌లేం. అయితే, ఈ గెలుపుతోనే సంతృప్తి చెందితే.. ఫ్యూచ‌ర్ ప‌రిస్థితి ఏంటి? మ‌ళ్లీ మ‌ళ్లీ ఎన్నిక‌లు రావా? వ‌స్తే.. ఇలాంటి గెలుపును మించిన విజ‌య‌మో.. లేక ఇదే రేంజ్ గెలుపునో సొంతం చేసుకుంటేనే పార్టీ ప‌రువు, అధినేత పరువు కూడా రెండు నిల‌బ‌డ‌తాయి. అందుకే జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నా రు.ఈ నిర్ణ‌యంతో రెండు అంశాల‌పై ఆయ‌న క‌త్తి దూసే కార్య‌క్ర‌మానికి రెడీ అయ్యారు. వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 

ఈ ఎన్నిక‌ల్లో పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పునాదులు ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ ప‌రంగా ఆయ‌న ఏం చేయాలో అంత‌కు మించి అనే రేంజ్‌లో ప‌నులు, ప‌థ‌కాలు చేస్తున్నారు. అయితే, త‌న ఒక్క‌డి వ‌ల్లే కాకుండా పార్టీలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న వారికి కూడా ఈఎన్నికల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌తంలో వైఎస్ 2004, 2009 ఎన్నిక‌ల్లోకాంగ్రెస్‌ను వ‌రుస‌గా అధికారంలోకి తీసుకు వ‌చ్చాక‌.. ఆయ‌న అనుస‌రించిన ఫార్ములానే ఇప్పుడు జ‌గ‌న్ తెర‌మీద‌కి తెచ్చార‌ని వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది.

 

అదే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మంత్రుల‌ను బాధ్యుల‌ను చేయ‌డం. భారీ సంఖ్య‌లో స్థానిక సంస్థ‌ల‌ను కూడా వైసీపీ త‌న ఖాతాలో వేసుకునేలా మంత్రులు చ‌క్రం తిప్పాల్సి రావ‌డం. ఏపీలో ముందుగా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఏపీలో మొత్తం జిల్లా పరిషత్తులు వైసీపీ గెలుచుకోవాలని జగన్ గట్టిగా చెబుతున్నారు. ఈ బాధ్యత మొత్తం మంత్రుల మీద జగన్ ఉంచారని స‌మాచారం.  ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నందున‌ ఎక్కడా తేడా రాకూడదని, విపక్షానికి వీసమెత్తు కూడా అవకాశం ఇవ్వకూడదని జగన్ క్లారిటీగా చెప్పేస్తున్నారుట.

 

జిల్లా ఇంచార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అంతా కలసి ఒక్క మాటగా ముందుకు సాగాలని జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే మంత్రుల పనితీరుకు గీటు రాయి అని జగన్ పేర్కొంటున్నట్లుగా స‌మాచారం. ఎవ‌రు దూకుడు చూపిస్తే.. వారికే మంత్రి ప‌ద‌వి నిలుస్తుంద‌న అంటున్నారు. గ‌తంలో వైఎస్ కూడా ఇలానే బాధ్య‌త‌గా ఉండ‌ని మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టారు. మ‌రి ఇప్పుడు వైసీపీలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌ణాళిక అమ‌లైతే.. మంత్రుల స‌త్తా ఏంటో తెలిసిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: