రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం లో కీల‌క చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా సీఎం జ‌గ‌న్‌.. త‌న మంత్రివ‌ర్గానికి కొన్ని టార్గెట్లు విధించారనే ప్ర‌చారం ఊపందుకుంది. భారీ మెజారిటీతో ప్ర‌భుత్వం కొలువు దీరింది. అయితే, ఈ స్థాయి గెలుపును అనుభ‌వించ‌డంతోపాటు.. ఈ గెలుపు ను మ‌రింత‌గా పెంచుకునేందుకు, లేదా గెలుపును కొన‌సాగించుకునేందుకు ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ నిర్ణ‌యించుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌డం లేదు. అయితే, వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నించ‌కుండా.. జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్నారా? అనే సందేహాలు మాత్ర‌మే వ‌స్తున్నాయి.

 

ఈ ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు అనేది కేవ‌లం జ‌గ‌న్ వ‌ల్ల మాత్ర‌మే సాధ్య‌మైంది. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా తిర‌గ‌ని, అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం కూడా లేని వ్య‌క్తులు ఈ ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. గుంటూరు జిల్లాను తీసుకుటే.. నందిగం సురేష్ ఎంపీగా, డాక్ట‌ర్ శ్రీదేవి, విడ‌ద‌ల ర‌జ‌నీ(ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది) వంటివారు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. వీరికి ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేదు. ప‌రిచ‌యాలు కూడా లేవు. అయినా కూడా గెలిచారంటే.. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను చూసి మాత్ర‌మే వారికి ఓట్లు వేశార‌నేది సుస్ప‌ష్టం.

 

మ‌రి అలాంటి వారికి ఇప్పుడు జ‌గ‌న్ అగ్ని ప‌రీక్ష వంటి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం అనేది ఆలోచించాల్సిన విష‌యం. ముఖ్యంగా మంత్రుల్లోనూ ఇలాంటి అమాంబాప‌తు నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప‌శ్చిమ గోదావ‌రి కి చెంది న శ్రీరంగ‌నాథ‌రాజు, ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆదిమూల‌పు సురేష్ వంటివారు జ‌గ‌న్ బ‌లంతోనే గెలుపు గుర్రం ఎక్కారు. అలాంటి వారికి ఇప్పుడు జ‌గ‌న్ ఏకంగా అత్యంత కీల‌క‌మైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం అనేది చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. స్థానికంగా బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న టీడీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంది.

 

పైగా.. మంత్రుల‌కు మాత్ర‌మే బాధ్య‌త‌లు ఇవ్వ‌డం వ‌ల్ల స్థానికంగా మ‌రింత‌గా పార్టీలో ఆధిప‌త్య ధోర‌ణి పెరిగే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు మంత్రుల‌కు మ‌ధ్యే మార్గంగా భారంగా కాకుండా జ‌గ‌న్ ఈ టార్గెట్‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: