షాద్ నగర్లో వెటరినరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన పాశవిక గ్యాంగ్ రేప్, హత్య యావత్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత హేయంగా జరిగిన ఈ దారుణకాండ అందరినీ కలచి వేస్తోంది. సమాజంలో మహిళల భద్రతకు పెను సవాల్ విసిరిన ఈ ఉదంతంపై గళమెత్తని వారు లేరు. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో పలువురు తమ గొంతు కలిపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ దారుణ ఘటనపై స్పందించారు.

 

 

ఈ సందర్భంగా చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. ‘రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న తీరు మనసు కలచివేస్తోంది. దేశంలో ఆడపిల్లలకు భద్రత కరువైపోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మగ మృగాల మధ్య మనం బతుకుతున్నామా.. అనిపిస్తోంది. ఓ అన్నగా, తండ్రిగా ఇటువంటి సంఘటనలు కలచి వేస్తున్నాయి. ఇటువంటి నేరస్థులకు శిక్షలు కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు. నేరస్థులను త్వరగా పట్టుకున్నందుకు అభినందనీయమే అయినా శిక్ష కూడా త్వరితగతిన పడేలా చూడాలి. అప్పుడే ఇటువంటి నేరాలు చేయడానికి భయపడతారు. ఆడపిల్లలు తమ స్మార్డ్ ఫోన్ లో 100 నెంబరు సేవ్ చేసుకోండి. హాక్ ఐ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పోలీసు వారి సేవల్ని ఉపయోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటూ ఆయన తన సందేశాన్నిచ్చారు.

 

 

ఈ ఘటనపై జాతీయ మీడియా కూడా తీవ్రంగా స్పందించింది. 2012లో జరిగిన నిర్భయ ఘటనను మరిపిస్తూ జరిగిన ఈ దారుణ హింసా హత్యాచార కాండ అందరి మనసులను కలచివేస్తోంది. న్యాయవాదులు సైతం నిందితుల తరపు ఎవరూ వాదించకూడదని నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్ర రూపం దాల్చిందో అర్ధమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: