రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కడప జిల్లా రైల్వే కోడూరు వెళ్లారు. పర్యటనలో భాగంగా స్థానిక జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. సమావేశంలో సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ సీఎంలా ప్రవర్తించడం లేదు కాబట్టే ‘జగన్ రెడ్డి’ అని పిలుస్తున్నానన్నారు. హోదాకు తగ్గట్టుగా హుందాగా మాట్లాడాలని జగన్‌కు వైసీపీ నేతలు చెప్పాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందన్న జగన్ రెడ్డి.. ఇప్పుడాయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

 

 

రాయలసీమ వెనుకబాటుతనానికి నాయకులే కారణమని ఆరోపించారు. రాయలసీమ సంస్కృతి అంటే పగలు, ప్రతీకారాలు కాదని అన్నారు. తొలిసారి కడప జిల్లాలోనే తెలుగు శాసనాలు లభ్యమయ్యాయని ఈ సందర్భంగా అన్నారు. రాయలసీమ అంటే సరస్వతి అని.. చదువు ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. కడపలో ప్రజలు ఉపాధి కోరుకుంటే.. ప్రాణాలు తీసే అణుశుద్ధి కర్మాగారాలను జగన్ ఆహ్వానించారని ఆరోపించారు. రాయలసీమలో సమస్యలపై ప్రధానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. పసుపు రైతులకు ఎందుకు న్యాయం చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మోడీని అడిగే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. భూములు అమ్ముతున్నారు.. ప్రకృతిని కూడా అమ్మేయండని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

వైసీపీ నేతలు భయపెట్టడం వల్లే జనసేనకు ఓట్లు వేయలేదని.. ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపోటములు ఉండవని అన్నారు. సీమ ప్రజల ఆవేదనకు జనసేన దారి చూపిస్తుందని భరోసా ఇచ్చారు. మనకూ రోజులూ వస్తాయి.. ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ విద్యార్థినిని చంపిన వాళ్లకు ఘటనపై కేసు కూడా పెట్టని పోలీసులకు బిడ్డలు లేరా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: