అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సమిష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్పూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తాను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందని సిఎం అన్నారు. ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలన్నారు.

 

నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని చెప్పారు. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా  ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన పక్షంలో  రోజుకు గంటో , అరగంటో ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా, కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు.

 

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని సిఎం ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదని గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల మాదిరిగా ఎక్కువ వేతనాలు, సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్ లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలని సిఎం ఆకాంక్షించారు.ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్ ఆత్మీయ సమావేశం... ఆద్యంతం ఉద్వేగ భరితంగా జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణం లో సాగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: