దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య ఘటన పార్లమెంట్ కు చేరింది. దిశకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేశాయి. మహిళల రక్షణ గురించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. దిశ గురించి చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో నోటీసులు ఇచ్చింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను మార్చాలని విపక్షాలు, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
పార్లమెంట్ బయట కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు దిశ ఘటనను సభ దృష్టికి తెచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో పార్టీ తరపున వాయిదా తీర్మానం ఇచ్చారు. బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా దిశ హత్య ఘటనతో పాటు పెరుగుతున్న నేరాల గురించి రాజ్యసభలో జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. 
 
లోక్ సభ స్పీకర్ దిశ ఘటన గురించి చర్చించటానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా విపక్షాలు సభాముఖంగా తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి దిశ ఘటనను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని మీడియాతో చెప్పారు. 
 
దిశ ఘటనపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ దేశం మొత్తాన్ని దిశ హత్య ఘటన కలచివేసిందని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు ఎన్ని చట్టాలు చేసినా ఆగడం లేదని అన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చట్టాలలో మార్పులు చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను జీరో ఎఫ్ఐఆర్‌ విషయంలో పాటించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే సత్వర న్యాయం జరుగుతుందనే విధంగా తీర్పు ఉండాలని ఆజాద్ చెప్పారు 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: