దిశ ఘటనపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. దిశకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేశాయి. మహిళల రక్షణ గురించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. దిశ గురించి చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో నోటీసులు ఇచ్చింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను మార్చాలని విపక్షాలు, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

పార్లమెంట్ బయట కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు దిశ ఘటనను సభ దృష్టికి తెచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో పార్టీ తరపున వాయిదా తీర్మానం ఇచ్చారు.  ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు. అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్‌ మాట్లాడుతూ.. 'దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించాలి. మరణించేంత వరకు వారిని ఉరితీయాలి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి' అని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేయాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. శిక్షలు వెంటనే అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సభలోని అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభలోను దిశ హత్యపై చర్చకు సభ్యులు పట్టుబట్టారు. దీంతో జీరో అవర్‌లో స్పీకర్‌ దీనిపై చర్చకు అనుమతిచ్చారు.టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతూ.. హైదరాబాద్ ఘటన.. ఢిల్లీ ఘటనను గుర్తు చేసి మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్‌పై సుప్రీం ఆదేశాలను పాటించాలన్నారు. ఘటనకు ముందు పెట్రోలింగ్, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు.మరోవైపు దిశఘటనపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో వీరంతా ఆందోళన చేపట్టారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఫర్‌ దిశ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: