తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం పై తెలుగుదేశం పార్టీ , జనసేన లు వైస్సార్ కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి . జగన్ సర్కార్ అప్రతిష్ట పాలుచేసేందుకు విపక్షాలు సంధిస్తున్న విమర్శలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొట్టడం లో … ఎందుకనో కాసింత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టం అవుతోంది . టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం పై చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక్కరే విపక్షాల విమర్శలపై ధీటుగా స్పందించగా , అధికార పార్టీ ప్రజాప్రతినిధులు , నాయకులు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది .

 

 జగన్ సర్కార్ ను మొదటి నుంచి టీడీపీ నాయకత్వం  ఏదోరకంగా ఇబ్బంది పెట్టాలని ఎత్తుగడ వేస్తోంది . ఏ ఒక్క అవకాశాన్ని ఆ పార్టీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్పించడం లేదు . ఇసుక వ్యవహారం లో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకత్వం , చివరకు దీక్ష కూడా చేసిన విషయం తెల్సిందే . అయితే టీడీపీ నాయకత్వ విమర్శలను తిప్పికొట్టేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , మంత్రులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ తమదైన వేదికను ఉపయోగించుకున్నారు . ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం తో , ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలకు మరో ఆయుధం కావాలి ... అది టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం రూపం లో లభించింది .

 

దాన్ని విపక్షాలు సద్వినియోగం చేసుకుని అధికార పార్టీ అభాసుపాలు చేయాలని చూస్తున్నాయి . అయితే అన్యమత ప్రచారం పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి మొదటికి మోసం తెచ్చే అవకాశాలున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: