శనివారం నవంబర్ 30 వ తారీఖున నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ హాస్టల్‌ నుంచి అదృశ్యమైన యువతి ఆచూకి ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. ఆ రోజు హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా.. అంటూ సూసైడ్‌ నోట్‌ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్‌ యాజమాన్యం అప్రత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతటి కధను అల్లిన విద్యార్ధిని పేరు మౌనిక(19).. ఇక ఈమె రాసిన  లేఖ నారాయణగూడ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన విషయం విదితమే. ఇప్పుడు ఆ యువతిని, ఆమెతో పాటు ఉన్న ఓ అబ్బాయిని కూడా గుంటూరులో అదుపులో తీసుకుని సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.

 

 

అదేమంటే ఇద్దరిది ఒకే గ్రామమైన  ఆ అబ్బాయితో  యువతికి బాల్యం నుంచే పరిచయం ఉందట అప్పటికే ఇద్దరూ ప్రేమించుకుని, కలిసి తిరిగారట. ఆ సందర్భంలో ఫొటోలు కూడా దిగారు. కొంతకాలానికి విడిపోయాక ఉన్నత చదువుల కోసమ మౌనిక హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటూ నారాయణగూడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువు కుంటోంది. ఆ అబ్బాయి కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. ఆ అమ్మాయి ఇక్కడే ఉందని తెలుసుకొని ఆమెకు తరచూ ఆమెకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. ఈ అమ్మాయి మాట్లాడేందుకు నిరాకరిస్తే కళాశాలకు, హాస్టల్‌కు వెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెడతానని, తానూ చచ్చిపోతానని బెదిరింపులకు దిగేవాడని పోలీసులతో యువతి చెప్పిందని తెలుస్తోంది.

 

 

ఇదే కాకుండా తన దగ్గరున్న ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. అతన్ని వదిలించుకునేందుకు చావే తన సమస్యకు పరిష్కారంగా భావించానని పోలీసుల ముందు ఆ యువతి వాపోయిందని సమాచారం. మరింతగా విచారించగా గత్యంతరం లేక అతడితో కలిసి గుంటూరులో ఉంటున్న అతని బావమరిది దగ్గరకు వెళ్లగా అతను ఇద్దరికి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. యువతికి స్థానికంగా ఓ మహిళా హాస్టల్‌లో వసతి కల్పించారు.

 

 

ఆ లోపు అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి సారథ్యంలో నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణ తన బృందంతో గుంటూరు చేరుకుని పట్టుకోవడంతో ఆమె కథ సుఖాంతమైంది. సోమవారం ఉదయం నగరానికి తీసుకువచ్చి వారిని వేర్వేరుగా విచారించి. ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించి, అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు. ఈ విషయమై నారాయణగూడ పోలీసులను వివరణ కోరగా..  అప్పుడే తామేమీ చెప్పలేమని,  విచారణ కొనసాగుతోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: