భారత క్రికెట్ జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాలు అందించిన మిస్టర్ కూల్ ఎం‌ఎస్ ధోనీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇదివరకు ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురవ్వడం వల్ల తాను నాయకత్వం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల పాటు టోర్నీకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదం సద్దుమణిగిందనే సమయంలోనే ధోనీ ఇంకో వివాదంలోకి వచ్చి పడ్డాడు. సంచలనం సృష్టించిన ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ స్కామ్‌లో పోలీసులు ధోనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

 

కాగా, ఆమ్రపాలి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వ‌ర‌కు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. దీంతో చాలామంది నమ్మి ఫ్లాట్ల కోసం డబ్బులు అడ్వాన్స్ రూపంలో ముట్టజెప్పారు. అలా వచ్చిన కోట్ల సొమ్మును ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు తరలించడం జరిగింది. అయితే ధోనీ భార్య సాక్షికు చెందిన సంస్థ కూడా ఉంది. ఇక ఫ్లాట్ల కోసం డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్‌ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు అందాయి.

 

దీంతో ఈ ఫిర్యాదులపై 2017లో సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. అందులో ఆమ్రపాలి సంస్థ ప్రజల డబ్బును వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లను జైలుకు కూడా పంపింది. అయితే ధోనీ మీద నమ్మకంతోనే ఫ్లాట్లకు అడ్వాన్సులు ఇచ్చామని కొందరు చెబుతున్నారు. దీంతో ఆయనపై కూడా ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశారు.

 

ఇదిలా ఉంటే గత ఏప్రిల్ నెలలో ధోనీ కూడా ఆమ్రపాలి సంస్థ బాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఇంకా ఇవ్వలేదని ధోనీ కోర్టుకు నివేదించాడు. మరోవైపు రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్‌హౌస్‌ను తాను బుక్‌ చేసుకున్నానని.. ఇంతవరకూ పెంట్‌హౌస్‌ను తనకు అప్పగించలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇక దీనిపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: