మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న రాజకీయాన్ని ఎండగట్టారు. ఓటుకు కోట్లు కేసుతో హైదరాబాద్‌ నుంచి పరుగెత్తుకొని వచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. అందుకే నిన్ను నమ్మం బాబు అంటూ చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి బలవంతంగా భూములు తీసుకున్నారని ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు.

 

ఈ నెల 5వ తేదీ చంద్రబాబు విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి సమావేశాలు విజయవాడలో కాకుండా మీరు గ్రాఫిక్స్‌లో కట్టిన అమరావతికి తీసుకొచ్చి ఆ మేధావులతో పాటు జర్నలిస్టులకు చూపిస్తే..వాస్తవాలు తెలుస్తాయన్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని జిల్లెడు మొక్కలు, బీడుబారిన భూములు కనిపిస్తాయన్నారు. వాళ్లందరికీ మీరు రాజధాని ప్రాంతం చూపిస్తే..అది అమరావతి కాదు..భ్రమరావతి అని తేలిపోతుందన్నారు.

 

బాహుబలి సినిమాలోని మాహిష్మతి సెట్టింగ్స్‌, గౌతమి శాతకర్ణి సినిమాలోని అమరావతి సెట్టింగ్స్‌తో గ్రాఫిక్స్‌ చూపించారని ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎవరో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గతంలో చెరుకు తోటలు తగులబెట్టారో అందరికి తెలుసు అని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రైతుల హృదయాలపై కారం చల్లి తగుదునమ్మ అంటూ రాజధాని ప్రాంతంలో పర్యటించడం ఎంతవరకు న్యాయమన్నారు.

 

రాజధాని పేరుతో ఐదేళ్లు చంద్రబాబు కాలయాపన చేశారని, సింగపూర్‌ వెళ్తే అలాంటి రాజధాని కడుతానంటారు..లండన్‌ వెళ్తే ట్రైన్‌ తెస్తానంటారు. దావూస్‌ వెళ్తే బుల్లెట్‌ ట్రైన్‌ అని వందల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ అక్కడ అంటూ మీ బినామీలతో భూములు కొనుగోలు చేయించి దోచుకున్నారని ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మొత్తానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశంపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: