దేశమంతటా దిశ రేప్ , మర్డర్ ఉదంతంపై దుమ్మెత్తిపోస్తుంటే.. కొందరు నోటి దూలగాళ్లు మాత్రం దిశ రేప్ ను సమర్థిస్తున్నట్టుగా మాట్లాడారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందనో.. కంప్యూటర్ ఉందనో రెచ్చిపోయారు.. నోటికి వచ్చినట్టు పోస్టులు పెట్టారు. అక్కడితో ఆగని శాడిస్టులు.. దిశ ప్రవర్తనపైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేనా.. ఆమె ఫోటోను అశ్లీల చిత్రాలతో మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

 

దీంతో వీరి వ్యవహారంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దాగారు. వారిలో కొందరిని ఆరెస్టు చేసి జైలుకు పంపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన చవన్‌ శ్రీరామ్‌ కూడా ‘దిశ’ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టాడు. ఆగ్రహించిన నెటిజన్లు.. రెండ్రోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

 

నిజామాబాద్ పోలీసులు ఆ పోస్టులు పరిశీలించి.. ‘స్టాలిన్‌ శ్రీరామ్‌’ పేరుతో ఉన్న ఖాతాను గుర్తించారు. జనం గడ్డి పెట్టడంతో సదరు శ్రీరామ్ అనే కుర్రాడు.. ఆ పోస్టులు డిలీట్ చేసాడు. అయినా పోలీసులు అతని ఆచూకీ తెలుసుకుని చవన్‌ శ్రీరామ్‌ను అరెస్ట్‌ చేశారు. ‘దిశ’పై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌లలో పోస్టులు పెడుతున్న వారిపై హైదరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కూడా దృష్టి సారించారు.

 

హైదరాబాద్‌లో ఉంటూ ఇలాంటి పోస్టులు పెట్టిన నలుగురి చిరునామాలను పోలీసులు గుర్తించారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘స్మైలీ నాని’ పేరుతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన నిందితుడి కోసం వెతుకుతున్నారు. స్మైలీ నాని పేరుతో అశ్లీల వీడియోలను ఉంచిన నిందితుడు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించినా.. పోలీసులు వెళ్లే సరికి పారిపోయాడు. అతడి కోసం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతడి కోసం గాలిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: