ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తరువాత పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేసింది. అక్టోబర్ నెల 2వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
కానీ ఎవరూ ఊహించని విధంగా 38 మంది వార్డ్ సచివాలయ ఉద్యోగులు అధికారుల తీరుతో తిరుపతిలో రాజీనామాలు సమర్పించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని చోట్లా విధుల్లో చేరిన ఉద్యోగులు విధులకు హాజరవుతూ పని చేస్తున్నారు. ప్రభుత్వం సొంతూరుకు దగ్గరలో, సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం కల్పించటంతో ఎంపికైన వారంతా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. తిరుపతిలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. 
 
తిరుపతి మున్సిపాలిటీలో 102 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయగా 736 మంది కౌన్సెలింగ్ ద్వారా విధుల్లో చేరారు. గడచిన మూడు వారాల నుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో రాజీనామాల పర్వం మొదలైందని తెలుస్తోంది. కొందరు అధికారుల పని తీరు, పనిఒత్తిడి అధికంగా ఉండటం వలన ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సహకారం లేకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం వలన కొందరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 
 
అధికారుల మాట తీరు సరిగా లేదని అధికారుల పెత్తం ఎక్కువైందని తిరుపతిలో ఉద్యోగులు మండిపడుతున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఉద్యోగులను ఇతర వార్డులకు బదిలీ చేయడంతో కొందరు ఉద్యోగులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కమిషనర్ తో ఎటువంటి సమస్యలు లేవని అధికారుల తీరు వలనే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఉద్యోగుల రాజీనామా అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తిరుపతి మున్సిపాలిటీలో సచివాలయ ఉద్యోగుల వరుస రాజీనామాలు సంచలనం రేకెత్తించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: