తెలుగు రాష్ట్రాల్లో వ‌రుస‌గా మ‌హిళ‌ల‌పై దారుణాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా పోలీసులు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.  అభయ్ డ్రాప్ హోం సర్వీస్ పేరుతో వాహనాలు ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో రాత్రి 9 గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు మహిళల్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. వాహనంలో డ్రైవర్‌తో పాటూ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ఈ వినూత్న ఆలోచ‌న‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డం...వారు వెంటనే ఆమోదం తెల‌ప‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయి అమ‌ల్లోకి రావ‌డం విశేషం.

 

పోలీసుల ఆలోచ‌న‌కు ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేక‌లు వెల్లువెత్తుతున్నాయి.  బుధవారం ఎస్పీ కౌశల్ చేతుల మీదుగా ఈ అభయ్ వాహనాలను ప్రారంభించారు. రాత్రి 9 గంటలనుండి తెల్లవారుజాము 5 గంటల వరకు ఒంటరిగా ఉన్న మహిళలకు తోడుగా ఒక మహిళా పోలీస్ ద్వారా వారిని సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ స‌ర్వీసుపై ప్ర‌జ‌ల నుంచి మ‌రిన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుని మెరుగుగా అందించేందుకు కృషి చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  

 

మహిళలు ఎవరైనా అత్యవసర సమయాల్లో ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. వెంటనే అభయ్ డ్రాపింగ్ వెహికల్ వారున్న చోటుకు వెళ్ల‌డంతో పాటు వారిని ఇంటి వ‌ద్ద దింపే బాధ్య‌త‌ను తీసుకుంటుంద‌ని చెప్పారు. అభయ్ వాహనాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షించ‌డం జ‌రుగుతుంద‌ని ఎస్పీ తెలిపారు.ఈ అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ప్రస్తుతం ఒంగోలు సబ్ డివిజన్‌లో నాలుగు, చీరాల సబ్ డివిజన్‌లో రెండు.. మార్కాపురం, కందుకూరు సబ్ డివిజన్ లో ఒక్కో వాహనం అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు.

 

అలాగే జిల్లాలోనూ మహిళ భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటు జిల్లావ్యాప్తంగా బాలికలకు ఆత్మరక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ‌హిళ‌ల‌పై  దాడులు, అత్యాచారాలు పెరుగుతున్న నేప‌థ్యంలో పోలీసులు చేప‌ట్టిన అభ‌య్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న వ‌స్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: