ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబుకు బీజేపీ మీద బాగా ప్రేమ పెరిగిపోయింది. అందుకే కుదిరినప్పుడల్లా బీజేపీపై ప్రేమబాణాలు సంధిస్తున్నారు. అయితే బాబు ఎన్ని బాణాలు వేసిన బీజేపీ మాత్రం లొంగడం లేదు. బాబుతో ఎప్పటికైనా డేంజర్ అని అర్ధమయ్యి ఆయనకు దూరంగానే ఉంటున్నారు. కాకపోతే బాబుని పక్కనబెడుతున్న బీజేపీ...పవన్ ని మాత్రం కలుపుకోవాలని చూస్తుంది. గత కొన్ని రోజులుగా ఇదే లైన్ లో రాజకీయం నడుస్తుంది. బాబు ఏమో బీజేపీకి దగ్గరవాలనుకుంటే....బీజేపీ ఏమో బాబుని దూరంగా పెడుతుంది. మధ్యలో పవన్ మద్ధతు కావాలని అనుకుంటుంది.

 

అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ళు బాగానే ఉన్న వీరి పొత్తు తర్వాత తెగిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ ఇవ్వడం లేదని చెప్పి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చేశారు. ఇక వచ్చిన దగ్గర నుంచి బీజేపీని ఏకధాటిగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పైగా ధర్మపోరాట దీక్షల పేరిట బీజేపీని ఆగమాగం చేశారు. అటు బీజేపీ కూడా ఎన్నికల్లో బాబుని ఓడించడమే లక్ష్యంగా పని చేశారు.

 

ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం వల్ల రెండు పార్టీలు ఏపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో బాబు మనసు మళ్ళీ ఇటు వైపు తిరిగింది. వైసీపీ ఏమన్నా కేసులతో ఇబ్బందులు పెడుతుందేమో అన్న భయంతో బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడప్పుడు బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి తప్పు చేశానని మాట్లాడుతూ వచ్చారు. 

 

అయితే బాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన బీజేపీ మాత్రం కరగలేదు. బాబు లక్ష్యంగా విమర్శలు చేస్తూనే వచ్చింది. పైగా బాబు చేపట్టిన కార్యక్రమాలకు కూడా మద్ధతు ఇవ్వలేదు. ఇసుక దీక్ష చేసిన, తాజాగా అమరావతి నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన హాజరు కాలేదు. అంటే ఈ పరిణామాలని బట్టి చూస్తే బాబు బీజేపీకి దగ్గర జరుగుతుంటే...బీజేపీ మాత్రం దూరంగా జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: