ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి . వైకాపా , జనసేనల మధ్య మాటలయుద్ధం పతాకస్థాయి కి చేరుకుంటోంది . నువ్వు ఒక్కటంటే , నేను రెండు అంటానన్నట్లుగా పరిస్థితి తయారయింది . ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనాని సైతం , వైకాపా ప్రభుత్వం పై , ఆ పార్టీ నేతలపై విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు . రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తూ పవన్ , రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు .

 

 దీనితో  రాష్ట్రం లో  అసలు  ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యా ?, లేకపోతే జనసేననా ?? అన్న చర్చ సర్వత్రా  కొనసాగుతోంది . పవన్ విమర్శలపై  వైకాపా నేతలు , రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయి లో విరుచుకుపడుతున్నారు . అయినా పవన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు . జగన్ సర్కార్ పై ఒంటికాలితో లేస్తున్నారు . జగన్ ఆర్నెల్ల పాలనా ఆరు అరాచకాలన్నట్లు సాగిందని మండిపడడమే కాకుండా , జగన్ ను తాను అసలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని పేర్కొని సంచలనం సృష్టించారు .

 

ఒక పార్టీ అధినేత అయి ఉండి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని , ముఖ్యమంత్రిగా తాను గుర్తించడం లేదని పేర్కొనడం ఏమిటన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది . ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పవన్ వైఖరి లో ఒక్కసారిగా మార్పు వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . గతం లో బీజేపీ కి దూరంగా ఉన్నట్లు వ్యవహరించిన పవన్ , ఒంటరిగా పోటీ చేసిన  తాను ఏనాడూ బీజేపీకి దూరంగా లేనని పేర్కొని అందర్నీ విస్మయానికి గురిచేశారు . పవన్ వ్యాఖ్యలు పరిశీలిస్తే బీజేపీ  మద్దతు తోనే అయన రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: