రాష్ట్రం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి ఆ  పార్టీ  అధినేత జగన్ మోహన్ రెడ్డి  గట్టి ఝలక్ ఇచ్చారు .  తమ పార్టీ కి చెందిన ఎంపీ తో  దోబూచులాడుతున్న బీజేపీ నాయకత్వానికి , మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు  కుటుంబ సభ్యులను తమ పార్టీ లో చేర్చుకుని బీజేపీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టారు  . ఆంధ్ర ప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులను , ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ , ఇటీవల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పై దృష్టి సారించిందన్న ఊహాగానాలు విన్పించాయి .

 

 వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నరసాపురం  ఎంపీ రఘురామ కృష్ణం రాజు , బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది . ఏకంగా ప్రధాని మోడీ ఆయన్ని రాజుగారు  బాగున్నారా ? అంటూ పలకరించారంటూ ప్రచారం జరగడంతో , ఇక  రఘురామ కృష్ణం రాజు … బీజేపీ లో చేరనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి . ఈ విషయమై రఘురామ కృష్ణం రాజు కు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారన్న వార్తలు వెలువడ్డాయి . అయినా ఆయన వైఖరి లో ఏమాత్రం మార్పు వచ్చినట్లు కన్పించడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

ఈ నెల 11 వ తేదీన రఘురామ కృష్ణం రాజు , హస్తిన లో రాజకీయాలకతికంగా అందర్నీ పిలిచి విందు ఇవ్వాలని నిర్ణయించారు .  రఘురామ కృష్ణం రాజు వైఖరి తో జగన్ విసిగిపోయారో లేక , కమలనాథులకు ఝలక్ ఇవ్వాలని  భావించారో తెలియదు కానీ నరసరాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీ ని తమ పార్టీ లో చేర్చుకుని  అటు బీజేపీ నాయకత్వానికి ,  ఇటు కృష్ణంరాజు కు పద్దతి మార్చుకోకపోతే  చర్యలు తప్పవన్న హెచ్చరిక సంకేతాలను పంపినట్లయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .    . 

మరింత సమాచారం తెలుసుకోండి: