జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆ పార్టీ కి నేడో , రేపో గుడ్ బై చెప్పడం ఖాయమని తేలిపోయింది . జనసేనాని నిర్వహించిన రైతు సౌభాగ్య సదస్సు కు గైర్హాజరయిన రాపాక కు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది . అయితే అందులో నిజం లేదని జనసేన వివరణ ఇచ్చే లోపే రాపాక తానే దిశా నిర్దేశం లేని పార్టీలో కొనసాగలేనంటూ తేల్చేశారు . తాను ఎవరి బిక్ష తో ఎమ్మెల్యేగా గెలువలేదని , తన స్వశక్తితో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు .

 

 అంతగా తనని ఎమ్మెల్యేగా గెలిపించేటట్లయితే , రెండు చోట్ల అయన ఎందుకు ఓడిపోయారని పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా ప్రశ్నించడం పరిశీలిస్తే... ఇక జనసేనతో  తెగతెంపులు చేసుకునేందుకే అయన రెడీ అయినట్లు స్పష్టం అవుతోంది .   ప్రభుత్వ స్కూళ్లలో  ఇంగ్లీష్ మీడియం  ప్రవేశపెట్టే అంశంపై అసెంబ్లీ లో జరిగిన చర్చలో పాల్గొన్న రాపాక , పార్టీ లైన్ కు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా , ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాఫిక్ గా మారింది . అసెంబ్లీ లో రాపాక వ్యవహారశైలి చూసిన ప్రతి ఒక్కరూ అయన అధికార పార్టీ కి చేరువ అవుతున్నారని భావించారు .

 

కానీ ఇంతలోనే పార్టీ నాయకత్వాన్ని సైతం ధిక్కరించే సాహసాన్ని చేస్తారని ఎవరూ ఊహించలేదు . జనసేన తరుపున గెల్చిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే కావడంతో ఆయన అధికార  పార్టీ లో జనసేన ఎల్పీ ని  విలీనం చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవని తెలుస్తోంది . అధికార పార్టీ లో జనసేనను అయన అసెంబ్లీ లో విలీనం చేస్తున్నట్లు త్వరలోనే ప్రకటించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .  అదే జరిగితే జనసేన కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: