ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లీష్ మీడియంపై జరిగిన చర్చలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇటీవల కాలంలో చంద్రబాబు విమర్శలు చేస్తూ.. గతంలో జగన్, ఆయన పత్రిక సాక్షి ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించినట్టు విమర్శించారు. దీనిపై జగన్ స్పందించారు. చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెడ‌తానంటే నేను వ్యతిరేకించిన‌ట్టు నిరూపించాలని జగన్ సవాల్ విసిరారు.

 

ఇష్టమొచ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తే స‌హించేది లేదు. అయిదేళ్లు అధికారంలో ఉండి స్కూళ్లను మార్చే అవ‌కాశం వ‌స్తే చేయ‌లేక ఇప్పుడు మేము చేస్తుంటే వ‌క్రభాష్యాలు చెబుతున్నారు. నారాయ‌ణ‌, చైత‌న్య స్కూళ్ల కోసం మొత్తం విద్యావ్యవ‌స్థనే భ్రష్టు ప‌ట్టించిన చంద్రబాబుకు మాట్లాడే నైతిక హ‌క్కు లేదు. ఇంగ్లిష్ మీడియం నేనే పెట్టాల‌ని చూశాన‌ని చెప్పుకుంటున్న బాబు.. అయిదేళ్లు ఏం చేసిన‌ట్టు అంటూ జగన్ నిలదీశారు.

 

ప‌త్రికల్లో వ‌చ్చిన ప్రతి క‌థ‌నాల‌ని మాకు అంట‌గ‌ట్టాల‌ని చూస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించం. టీడీపీకి పాంప్లెట్ పేప‌ర్ ఈనాడులో రాసిన క‌థ‌నాలు ఇక్కడ నేను ప్రదర్శిస్తే చంద్రబాబుకు ఎలా ఉంటుంది. ప్రతి ప్రభుత్వ బ‌డిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెట్టిన మొద‌టి రాష్ట్రం దేశంలోనే మ‌న ఆంధ్రప్రదేశ్ మొద‌టిది. కానీ ప్రభుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెడుతూ జీవో పాస్ అయిన నాటి నుంచి టీడీపీలో ఉలిక్కిపాటు మొద‌లైందని జగన్ అన్నారు.

 

 

రేష‌న‌లైజేష‌న్ పేరుతో 2014-19 మ‌ధ్య‌లో 6 వేల స్కూళ్ల‌ను మూసేశారని జగన్ అన్నారు. కనీస వ‌స‌తులుండ‌వు. అక్టోబ‌ర్ వ‌చ్చినా పిల్లలు యూనిఫాంలు, పుస్తకాలు రావు. ఆరు నెల‌ల‌పాటు మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లులు రావు, వంట మ‌నుషుల‌కు జీతాలివ్వరు. ఇదంతా గ‌వ‌ర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్ర.పేదవాడు సంక్షేమం గురించి ఆలోచ‌న లేని వ్యక్తి వ్యవ‌స్థల‌ను భ్రష్టుప‌ట్టించిన వ్యక్తి చంద్రబాబే. అందుకే చెబుతున్నా రైట్ ఎడ్యుకేష‌న్ కాదు.. మ‌న రాష్ట్రంలో ఇక‌పై రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేష‌న్ స్లోగన్ రావాలి అన్నారు జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: