ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా తెలంగాణ కవుల ప్రస్తావన వచ్చింది. దుష్టబుద్ధితో కొందరు రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రికి తెలుగు పట్ల, మాతృభాషపట్ల గౌరవం లేదన్నట్టు విమర్శలు చేస్తున్నది పద్ధతి కాదని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భాషాప్రేమకు మాధ్యమానికి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కవులను గుర్తు చేశారు.

 

ఆయన ఏమన్నారంటే.. " అక్షరాస్యత లేకపోయినా భాష మనుగడ సాగిస్తుంది. బోధన ద్వారానో, భాషా మాధ్యమం ద్వారానో భాష వికసించదు. స్వయంగా భాషమీద ప్రేమ, దానివల్ల సాహిత్య సృజన జరగడం వల్ల భాష విరాజిల్లుతుంది. తెలుగు సాహిత్యంలో అజరామరమైన సంగీత రచనలు చేసిన డా.సి.నా.రె తన ప్రాధమిక విద్య ఉర్దూలో చేసారు. మహాకవి దాశరధిరంగాచార్య గారు కూడా ఉర్దూ మాధ్యమంలో చదివినవారే..అంటూ భూమన గుర్తు చేశారు.

 

అంతే కాదు.. తెనాలికి వలస వచ్చిన తమిళుడు నటరాజన్ శారద అనే కలం పేరుతో తెలుగులో అద్భుతమైన రచనలు చేసాడు. తెలుగు భాషకు అత్యంత సేవ చేసిన వాళ్లంతా తెలుగు మాధ్యమంలో మాత్రమే చదివిన వాళ్లు కాదు. ఆంగ్లమాధ్యమం వద్దని, తెలుగులో చదివితేనే తెలుగుబతుకుతుందని కబుర్లు చెప్పే భాషా ప్రేమికులు చాలామంది తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదవిస్తున్నారు.. అంటూ ఎండగట్టారు.

 

బడుగులకు, దళితవర్గాలకు, దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న పిల్లలకు ఆంగ్ల బోధన యొక్క అవసరాన్ని గుర్తించి, ఆధిపత్య భావజాలంతో నడిచేవాళ్లకు మాత్రమే ఆంగ్లబోధన కాదని, కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కూలిపని చేసేవాడి కొడుకు కూలిపనికే పరిమితం కాకూడదని, బస్సు,ఆటో నడిపే డ్రైవర్ కొడుకు అందుకే పరిమితం కాకూడదనే సత్సంకల్పంతో ఉన్నతమైన ఆలోచనచేసి సమాజ గతిని మార్చడానికి ప్రాధమిక స్థాయిలోనే ఆంగ్లమాధ్యమాన్ని తేవాలనే సంకల్పాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క తెలుగు హృదయం ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: