ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన నాతో మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారని చెప్పారు. ఎన్ని విధాలా అవమానపరిచినా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు. స్పీకర్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడిన మాటలు సభలో అందరూ చూశారని. ఆ వీడియోలో కొంత అసభ్యకరమైన పదజాలం ఉందని అన్నారు. 
 
చంద్రబాబు నేను అనలేదని చెబుతున్నారని అది మనం చూశామని సభ్యులందరూ వారి ఆవేదనను చెప్పారని స్పీకర్ అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన వారు హుందాగా వ్యవహరించాలని చెప్పారు. చంద్రబాబు ఒకసారి పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చితే మంచిదని అభిప్రాయపడ్డారు. నిన్న బయటి వ్యక్తులు అసెంబ్లీలోకి ఎవరైతే వచ్చారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నానని స్పీకర్ చెప్పారు. 
 
చంద్రబాబు స్పందిస్తూ నాకు జరిగిన అవమానానికి ఎవరు విచారణ వ్యక్తం చేస్తారని అన్నారు. సభ అనేది ఎప్పుడూ వన్ సైడ్ ఉండదని అన్నారు. నన్ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం బాధాకరం అన్నారు. ఎమ్మెల్యే బుగ్గన మాట్లాడుతూ ఊరేగింపుగా వస్తే అసెంబ్లీలోకి ఆహ్వానించాలా...? అని ప్రశ్నించారు. గేట్లు కారాగారంలా ఉన్నాయని చంద్రబాబు అన్నారని ఆ గేట్లు కట్టించింది చంద్రబాబే అని బుగ్గన అన్నారు. 
 
రూల్స్ ఎప్పుడూ ఉంటాయని ఆ రూల్స్ పాటించేలా చేయడం మార్షల్స్ బాధ్యత అని అన్నారు. స్పీకర్ సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తారని బుగ్గన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నిన్న జరిగిన సంఘటనలో ప్రమేయం ఉన్న సభ్యులు, ఇతరులందరిపై చర్యలు తీసుకొని సభ్యులు, సిబ్బందికి భద్రత కల్పించాలని బుగ్గన కోరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాము పల్లెత్తు మాట కూడా అనలేదని బుగ్గన అన్నారు. తప్పు చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో పశ్చాత్తాపమే లేదని అన్నారు. ఎమ్మెల్యేల భద్రత కోసమే మార్షల్స్ ఉన్నారని బుగ్గన అన్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: