మాజీ మంత్రి కుమారుడు విశాఖ జిల్లా బీచ్ రోడ్ లో హల్ చల్ చేశాడు. మితిమీరిన వేగంతో మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్ ను ఢీ కొట్టాడు. బైక్ పై వెళ్తున్న యువకుడు ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. గాయపడిన యువకుడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు నడపటంతో కారు డివైడర్ మీద నుండి దూసుకెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు అతని స్నేహితులతో బీచ్ రోడ్ లో కారులో వెళుతున్నాడు. మితిమీరిన వేగంతో వెళ్ళటంతో పాటు మద్యం మత్తులో ఉన్న అప్పలనాయుడు ప్రయాణిస్తున్న కారు డివైడర్ పై నుండి దూసుకెళ్లి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు మితిమీరిన వేగంతో కారు నడిపిన అప్పలనాయుడుకు దేహశుద్ధి చేశారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు అప్పలనాయుడు, అతని స్నేహితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారు. కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు రిటైర్డ్ డీఐజీ కుమారుడు అని తెలుస్తోంది. 
 
పరారీలో ఉన్న అప్పలనాయుడును పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. బండారు అప్పల నాయుడు టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి బావమరిది కావడం గమనార్హం. పోలీసులు ఇప్పటికే ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణం చేసిన ప్రవీణ్, మౌర్య అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారని కమాచారం. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగగా గాయపడిన యువకుడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: