సీఎం జగన్ ఓ వైపు ప్రభుత్వాన్ని విజయపథంలో నడిపిస్తూనే మరో వైపు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. వైసీపీ ఏపీలో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచి విజయదుందుంభి మోగించింది. అయితే 2020 లో ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం ఈ నాలుగు కూడా వైసీపీ వశం కానున్నాయి. దీంతో ఇప్పటి నుంచే సీఎం జగన్ అభ్యర్దుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురకి పదవులు కూడా ఖాయమైనట్టు తెలుస్తోంది.  
 
ఇటీవల ప్రకాశం జిల్లా టీడీపీ నేత బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మస్తాన్ రావు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆప్త మిత్రుడు. వీరిద్దరు కూడా కలిసి చదువుకున్నారు. పార్టీలు వేరైనా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. ప్రస్తుతం ఒకే పార్టీలో ఉండడంతో మస్తాన్ రావు పదవి పొందడం కూడా సులభమైంది. మస్తాన్ రావు కు దాదాపు రాజ్యసభ సీటు ఖాయమైందని తెలుస్తోంది.   

పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా గోకరాజు గంగరాజు కుటుంబానికి మంచి పేరు ఉంది.  గోకరాజు గంగరాజు మాజీ ఎంపీ. ఇటీవల ఆయన కుమారుడు గోకరాజు రంగరాజు వైసీపీలో చేరారు. గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సీటు ఇస్తే రాజకీయంగా పార్టీ మరింత అభివృద్ది చెందుతుందని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. గోకరాజు రంగరాజుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
రాంకీ గ్రూపు అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభ సీటు ఖరారు అయినట్టుగానే తెలుస్తోంది. అయోధ్య రామిరెడ్డి 2014లో నరసరావు పేట ఎంపీగా పోటి చేసి స్వయాన ఆయన బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి  చేతిలో  ఓటమిపాలయ్యారు. అయోధ్య రామిరెడ్డి వైసీపీ ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషించారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీకి పని చేశారు. ఇప్పుడు ఇదే ఆయనకు పదవి రావడానికి కారణమవుతుందని అంతా చర్చించుకుంటున్నారు. అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించారు.  అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటు ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.  
 
ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు కావాలని వైవీ అడిగినప్పుడు దానిని మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇస్తున్నామని, రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ వైవీకి హామీనిచ్చారు. కానీ అనూహ్యంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవినిచ్చారు. వైవీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు తక్కువనే చెప్పుకోవచ్చు. వైవీకి రాజ్యసభ ఇవ్వకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇందులో దాదాపు రెండు రాజ్యసభ సీట్లు పార్టీలో నిన్న మొన్న చేరిన వారికి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీలో ఉన్న సీనియర్లు దీనిని ఆమోదిస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే సీఎం జగన్ కు ఎదురు తిరిగే సాహసం చేసేవారు వైసీపీలో లేరు. సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్. కాబట్టి రాజ్యసభకు సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేసినా అంతా ఆమోదించక తప్పదని చర్చ జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: