ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఆర్టీసి విలీనంపై ఒక కమిటీని వేసింది, ఈ కమిటీ ఆరు నెలలలోపు ఆర్టీసి విలీనంపై ఒక నిర్ణయాన్ని తెలపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసి పేరును ప్రజా రవాణా సంస్థ గా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 11న జరిగిన క్యాబినెట్ మీటింగులో ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసి విలీనానికి ముందే ఆర్టీసి కార్మికుల కారుణ్య నియామకాలకు ఓకే చెప్పేసింది. అలాగే ఆర్టీసికి బకాయి పడిన రూ 210 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పేర్లను పరిశీలించి వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.

 

మొత్తం 237 మంది 2015 సంవత్సరం వరకు కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోగా వీరందరి దరఖాస్తులు ఆమోదించి వీరిని శిక్షణకు పంపించారు అధికారులు. ఇక వీరికి ఆర్టీసి రూల్స్ ను సడలించినట్లు తెలుస్తోంది సాధారణంగా ఆర్టీసీలో కండక్టర్ అభ్యర్ధికి 153 సెం.మీల ఎత్తు తప్పనిసరి అయితే కారుణ్య నియామకాల అభ్యర్థులకు 145 సెం.మీ గా రూల్స్ ను సడలించారు. ఇక విధులకు గైర్హాజరు అయిన అభ్యర్థులను కూడా విధుల్లోకి తీసుకోనున్నారు. ఇలా విధులకు గైర్హాజరు అయిన అభ్యర్థులు 135 మంది వరకు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఇక ఆర్టీసి కార్మికుల ఆరోగ్య పరిస్థితి పైనా ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఆర్టీసి కార్మికులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఏదిఏమైనా ప్రభుత్వం ఆర్టీసి కార్మికులకు విలీనానికి ముందే శుభవార్త అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: