తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి క్యాడర్, స్థానిక నాయకత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వంశీ పార్టీని వీడగానే ఆయనతో పాటు స్థానిక నాయకులు, ఆయన అనుచరులు కొందరు పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన అనుచరుల నుంచి కొందరికి ఫోన్లు కూడా వెళ్లాయని రాజీనామా చెయ్యాలనే ఆదేశాలు కూడా వెళ్లాయనే ప్రచారం జరిగింది.

 

అయితే అనూహ్యంగా ఆయనకు... తర్వాత క్యాడర్ కాస్త షాక్ ఇచ్చింది. ఆయన సన్నిహితులుగా పేరున్న స్థానిక నాయకత్వం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయగానే వచ్చి పాల్గొనడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వంశీ ఆ తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కొందరితో వంశీ సమావేశం అయ్యారని, వారిని పార్టీలోకి తనతో పాటు రావాలని వంశీ కోరగా, వాళ్ళు అందుకు నిరాకరించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని వంశీకి నేరుగా చెప్పారట.

 

పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళే కొందరు తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా కొన్ని గుస‌గుస‌లు  మాత్రం వినపడుతున్నాయి. వంశీ పార్టీ మారినా సరే వైసీపీ లో గుర్తింపు వంశీ వర్గానికి ఉండదని, యార్లగడ్డ వర్గానికి గుర్తింపు ఎక్కువని, తాము పార్టీలోకి వెళ్ళినా సరే ఇబ్బందులు పెట్టడం ఖాయం అనే భావనలో వంశీ మద్దతుదారుల్లో ఉంది.

 

అసలు వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీలోకి వెళ్ళకుండా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. ఏదేమైనా గ‌న్న‌వ‌రంలో జ‌గ‌న్ యార్ల‌గ‌డ్డ‌, వంశీ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చినా కేడ‌ర్ మ‌ధ్య ఎంత వ‌ర‌కు స‌ఖ్య‌త ఉంటుంద‌న్న‌ది మాత్రం అనుమాన‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: