ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాట‌లోనే..తెలంగాణ సీఎం కేసీఆర్ న‌డిచారు. మందు బాబుల‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఏపీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చి 15 నుంచి 20 శాతం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అదే తీరులో తెలంగాణలోనూ ధరలు పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోందన్న ప్ర‌చారం నిజం చేస్తూ.... 10 శాతం  ధర పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు వెలువ‌రించింది. ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ మేర‌కు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు బుధ‌వారం నుంచి అమల్లోకి రానున్నాయి. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.

 


మ‌ద్యం ధ‌ర‌ల పెంపు వెనుక అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలో నూతన మద్యం పాలిసీలో మద్యం ధరలను భారీగా పెంచడమే కాకుండా వైన్ షాపులను పెద్ద మొత్తంలో తగ్గించారు. అంతేకాదు ఉన్న వైన్ షాపులను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహిస్తూ మద్యపానాన్ని క్రమంగా నియంత్రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీలోకి తెలంగాణ మ‌ద్యం అక్ర‌మంగా త‌ర‌లుతున్న‌ట్లు తేలింది. ఏపీలో తెలంగాణతో పోల్చుకుంటే క్వార్టర్‌పై రూ.50-100 వరకు వ్యత్యాసం ఉంది. పెరిగిన ఈ రేట్లను తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు మద్యం వ్యాపారులు తెలంగాణ నుండి మద్యం అక్రమంగా దిగుమతి చేసుకొని భారీగా లాభాలను అర్జించటమే కాకుండా సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈనేప‌థ్యంలో ధ‌ర‌ల పెంపు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారని స‌మాచారం.

 

ధ‌ర‌ల పెంపుతో మ‌ద్య‌నిషేధం వైపు అడుగులు వేసిన‌ట్లు అవుతుంద‌ని, అదే స‌మ‌యంలో అధిక ధ‌ర‌ల కార‌ణంగా తాగుడు స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని భావించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే 10శాతం పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  బాటిల్‌ సామర్థ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.80, బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు పెరిగిన ధరల పట్టికను ఆయన విడుదల చేశారు. పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.  కాగా, 2019-21 ఏడాదికి కొత్త ఎక్సైజ్ పాలసీని ఇటీవలే ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. ఈ కొత్త విధానం నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ స‌మ‌యంలోనే మ‌ద్యం ధ‌ర‌లు పెరుగుతాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: