ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరు నెలలలో సగటున 300 యూనిట్ల విద్యుత్తు ఉపయోగిస్తున్నట్లు తేలితే ఆ కుటుంబానికి రేషన్ కార్డు రద్దు కానుంది. ఈ సంవత్సరం మే నెల నుండి ఆగష్టు నెల వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం విద్యుత్ వినియోగం అధికంగా ఉంది. 
 
మారిన నిబంధనల ప్రకారం సగటున 300 యూనిట్లు దాటితే ఆ కుటుంబాల్లో పేదలున్నా వారు అనర్హులుగా మారతారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు నవశకం సర్వే చేసి వివరాలను సేకరిస్తున్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న వివరాలను సర్వే పూర్తయిన తరువాత రెవెన్యూ అధికారులు విద్యుత్తు కార్యాలయానికి పంపనున్నారు. ఒక నెలలో 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగం ఉంటే మిగతా నెలల వినియోగాన్ని పరిశీలించి సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటే రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారని సమాచారం. 
 
మరోవైపు గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న నవశకం సర్వే ముందుకు సాగడం లేదు. నవశకం సర్వేకు గడువు ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉండటంతో వాలంటీర్లు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి, ఫించన్లు, రేషన్ కార్డులు ఇతర పథకాలకు సంబంధించిన సర్వే శాఖలవారీగా మొదలైంది. వాలంటీర్లు ఈ నెల 22వ తేదీ నాటికి సర్వే పూర్తి చేయటంతో పాటు ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి. 
 
క్షేత్రస్థాయిలో సిబ్బంది దగ్గర ఉన్న సమాచారాన్ని పరిశీలించడానికి కూడా అనేక సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. అద్దె ఇళ్లలో నివశించే వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఇంటి నంబర్లు వ్యక్తుల వివరాలు మ్యాచ్ కాకపోవడం వాలంటీర్లకు ప్రధాన సమస్యగా మారుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తడం, సర్వర్ పని చేయకపోవడం కూడా సమస్యగా మారింది. మరోవైపు వాలంటీర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వకపోవటం కూడా సమస్యగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: