ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎంతో సంచలనం సృష్టించిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తీసుకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడైన వివేకానంద రెడ్డి ఎన్నికలకి కొన్ని రోజుల ముందు పులివెందులలోని తన సొంత ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఎన్నికల సమయం కావడంతో ఈ విషయంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముందు రోజు రాత్రి వరకు ప్రచారంలో భాగంగా మునిగిపోయిన వివేకానంద రెడ్డి, తెల్లవారేసరికి రక్తపుమడుగులో శవమై కనిపించారు.

 

 గత టిడిపి ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పటికీ కాలక్రమేణా ఈ కేసును పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసు విచారణలో వేగం పెరిగింది. ప్రస్తుతం వివేకానంద రెడ్డి హత్య కేసు ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ విచారిస్తుంది. ఇందులో భాగంగా అనేక మందిని అధికారులు విచారిస్తున్నారు.

 

విచారణలో భాగంగా పులివెందులకు చెందిన బీటెక్ రవి తో పాటు టిడిపి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ని కూడా విచారించారు. కానీ నిందను భరించలేని ఆదినారాయణ రెడ్డి పోలీసులకు సవాల్ చేశారు. నాకు కనుక ఈ హత్యతో ఏమాత్రం ప్రమేయం ఉందని తెలిసినా కూడా వెంటనే తనని ఎన్ కౌంటర్ చేయమని అన్నారు. అలాగే వివేక హత్య చేసింది ఎవరు వారి ఇంట్లో వాళ్లకి తెలుసు అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.


 అలాగే ఈ హత్య సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర రెడ్డిని  కూడా విచారించింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత అసలు నిజాలు బయటపెడతామని అధికారులు చెప్పారు. దీని పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 లోపు కేసు  దర్యాప్తు నివేదిక ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: