రాయలసీమ హక్కుల సాధన కోసం విద్యార్థులు యువత ఉద్యమించాలని ఆర్.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు వి రవి శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం   ఆర్.యస్.యు కర్నూలు జిల్లా 5వ  మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ పై చూపుతున్న వివక్షత విధానాలు విడనాడాలి. ముఖ్య అతిథులుగా పాల్గోన్న  ఓపిడిఆర్ జిల్లా అధ్యక్షులు ఎస్ ఖాజా మొహిద్దీన్, విశ్రాంత తాసిల్దార్ సయ్యద్ రోషన్ ఆలీ, అడ్వకేట్ అజయ్ కుమార్, విద్యార్ధి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆర్.ఎస్.యు కర్నూలు జిల్లా 5వ మహాసభలు స్థానిక కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆర్.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల శ్రీధర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.రవి శంకర్ రెడ్డి,  ఓపిడిఆర్ జిల్లా అధ్యక్షులు ఎస్ ఖాజా మొహిదీన్, విశ్రాంత తాసిల్దార్ సయ్యద్ రోషన్ ఆలీ, అడ్వకేట్ అజయ్ కుమార్,  రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు వి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ..  రాయలసీమ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీమ హక్కుల కాపాడుకునేందుకు విభజన నేపథ్యంలో 2014లో ఆర్.ఎస్.యు స్థాపించడం జరిగిందని,  నాటి నుండి నేటి వరకు రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ ప్రజలను చైతన్యం చేస్తూ ఆత్మగౌరవ యాత్ర, విద్యార్థి యువగర్జనలు, బస్సు యాత్ర, జీపు జాతర తదితర కార్యక్రమాలు ఆర్.ఎస్.యు పెద్ద ఎత్తున నిర్వహించిందన్నారు.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో ఏర్పాటు కావలసిన రాజధాని అమరావతికి తరలించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ఇప్పటికైనా పాలకులు మేల్కొని కర్నూలులో కనీసం హైకోర్టు ఏర్పాటు చేయాలని,  రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి అధిక నిధులు కేటాయించాలని,   వెనుకబడిన రాయలసీమలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని, రాయలసీమ నాలుగు జిల్లాల్లో 4 నూతన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, నాలుగు వందల టీఎంసీల నికర జలాలను సీమకు కేటాయించాలని, సిద్దేశ్వరం అలుగు,  పులికనుమ, వేదవతి,  గుండ్రేవుల,  గురు రాఘవేంద్ర,  తుంగభద్ర సమాంతర కాలువ,  హెచ్ ఎల్ సి, ఎల్ ఎల్ సి తదితర పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా శ్రీబాగ్ ఒప్పందం అమలు అయ్యేంత వరకు ఆర్.ఎస్.యు ముందుండి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.యు.ఎస్.ఎఫ్  జిల్లా కార్యదర్శి బి భాస్కర్ నాయుడు, ఆర్.ఎస్.ఎఫ్ నగర అధ్యక్షులు బి శివ రామ్  పాల్గొని రాయలసీమ సమస్యల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: