ఏపీ రాజధాని అమరావతి అంశం రాజకీయంగా వివాదాస్పదం అవుతోంది. మంత్రి బొత్స మంగళవారం చేసిన వ్యాఖ్యలతో రాజధాని మార్పు ఖాయమే అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతోంది. బొత్స వ్యాఖ్యల పట్ల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. రాజధాని అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అమెరికా పర్యటనకు ముందే ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని తమ నేతలకు చెప్పారా? లేదా? అని దేవినేని ప్రశ్నించారు.


ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండేళ్ళు కోర్టులో కేసులు వేశారని, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు లేఖలు రాసి రైతులను రెచ్చగొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు పట్టుదలతో ముందుకెళ్లి రాజధాని నిర్మాణం చేపట్టారని దేవినేని కొనియాడారు. రూ. కోటి 70 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరిగాయన్నారు.

 
మధురవాడ, భోగాపురంలో 6వేల ఎకరాల భూములను వైసీపీ నేతలు కొన్నారని, విజయసాయిరెడ్డికి కూడా ఆ భూముల్లో వాటాలు ఉన్నాయని దేవినేని ఉమా ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద పెట్టిన కేసులను ప్రభుత్వం రద్దు చేసిందని, విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారని, దీనిపై విచారణ చేస్తే వాస్తవాలు బయటకువస్తాయని దేవినేని ఉమా అన్నారు.

 
సీఎం జగన్‌ తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. జగన్ అసమర్థత, చేతకాని తనం వల్ల పరిశ్రమలు బయటకు వెళ్లిపోయాయన్నారు. ఎన్నికల్లో విజయం కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని, రివర్స్‌ పాలనతో ఏపీ అభివృద్ధిని రివర్స్‌ చేశారన్నారు. కక్ష, వివక్ష ఎజెండాతో జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధిని అందరూ కోరుకున్నారని, జగన్ చేసిన ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: